తేలిన లెక్క
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:56 AM
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో 655 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
జగిత్యాల, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో 655 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో జగిత్యాలలో 254, కోరుట్లలో 150, మెట్‌పల్లిలో 150, రాయికల్‌లో 49, ధర్మపురిలో 52 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, దర్మపురి మున్సిపాలిటీల్లో బరిలో నిలిపిన అభ్యర్థుల జాబితాలను ప్రధాన రాజకీయ పార్టీలయిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రకటించాయి. రిటర్నింగ్ అధికారులకు బీఫామ్‌లను అందజేశాయి. కాగా బీఫామ్ దక్కని పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ఫ జిల్లాలో త్రిముఖ పోటీ..
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో భారీగా అభ్యర్థులు నామినేషన్లను సమర్పించి బరిలో దిగినప్పటికీ, ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు గట్టిగా పోటీ పడుతున్నారు. వీరికి తోడు పలు ఇతర పార్టీలు, స్వతంత్రులు సైతం పలు వార్డుల్లో పోటీనిస్తున్నారు. అయినప్పటికీ అధిక వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది.
ఫజిల్లాలో 136 వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, జగిత్యాలలో 50 వార్డులు, కోరుట్లలో 33 వార్డులు, మెట్‌పల్లిలో 26 వార్డులు, దర్మపురిలో 15 వార్డులు, రాయికల్‌లో 12 వార్డులున్నాయి. ప్రధానంగా మూడు పార్టీల మద్య పోటీ నెలకొంది. కాగా జగిత్యాల, రాయికల్ మున్సిపల్‌లో కొన్ని వార్డుల్లో చతుర్మఖ పోటీ నెలకొంది. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అనుచరులు, ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అనుచరులు సైతం పలు వార్డుల్లో కాంగ్రెస్ బీఫామ్ దక్కకపోయినప్పటికీ పోటీలో ఉండడంతో చతుర్మక పోరు నెలకొంది.
ఫజగిత్యాల కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు..
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల వెల్లువ కొనసాగింది. జగిత్యాల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో పలువురు కాంగ్రెస్ ఆశావహులు బీఫామ్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవేదనకు గురయి బోరున విలపించిన సంఘటనలు సైతం నెలకొన్నాయి. జగిత్యాల రాజకీయాల్లో గత కొంత కాలం నుంచి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ల మధ్య నెలకొన్న విభేదాలు మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మరింత ముదిరాయి. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులకు అధిష్టానం ఝులక్ నిచ్చింది. తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రతిపాదించిన జగిత్యాల కాంగ్రెస్ జాబితాలో 50 వార్డులకు గాను 15 వార్డుల్లో మాత్రమే బీఫామ్‌లు దక్కినట్లు ప్రచారం ఉంది. రాయికల్‌లో 12 వార్డులకు గాను సగంలోపే జీవన్‌రెడ్డి వర్గీయులకు కాంగ్రెస్ బీఫామ్‌లు దక్కినట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వీరితో పాటు మెట్‌పల్లిలో సైతం ఒకరిద్దరు కాంగ్రెస్ ఆశావహులకు చుక్కెదరయింది. ఓ ఆశావహురాలు మెట్‌పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఫప్రచారంపై దృష్టి సారించిన అభ్యర్థులు
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. రానున్న ఆరు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాయి. వాల్ పోస్టర్లు, కర పత్రాలు, పోల్ చీటీలు, బ్యానర్లు, ఫ్లకార్డులు, కండువాలు, ఫ్లెక్సీలు ఇలా ప్రచార సామాగ్రిని తయారు చేసుకున్నాయి. పలు రాజకీయ పార్టీలు ప్రచార రథాలను ఇప్పటికే సిద్దం చేసుకున్నాయి. స్టార్ క్యాంపెయిన్‌లతో ప్రచారం నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్నాయి. దీంతో మునుముందు రోజుల్లో కాలనీలు, మున్సిపాలిటీలు ప్రచారంతో హోరెత్తనున్నాయి.