Share News

తప్పుల తడక..

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:14 AM

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో వెల్లడించిన ముసాయిదా ఓటర్‌ జాబితా తప్పుల తడకగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తప్పుల తడక..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో వెల్లడించిన ముసాయిదా ఓటర్‌ జాబితా తప్పుల తడకగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ముసాయిదా ఓటర్‌ జాబితా విడుదల చేయడంపై మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్‌ జాబితా గందరగోళంగా ఉండడంతో పోటీ చేయడానికి సిద్ధమైన ఆశావహుల్లో ఆందోళనలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఓటర్‌ జాబితాలో అనేక పొరపాట్లు దొర్లినట్లు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సవరించాలని కోరారు. మరోవైపు సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచిన ఓటర్‌ జాబితాలో పేర్లు కనిపించని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లను వార్డుల వారిగా విభజించి వెల్లడించాల్సి ఉండగా చాలా మంది ఓటర్లు ఒక వార్డులో ఇల్లు ఉంటే మరొక వార్డులోని జాబితాలో పేర్లు ఉన్నాయి. ఒకరి పేరు మీద డబుల్‌ ఓట్లు కూడా నమోదయి ఉన్నాయి. ఓటర్‌ జాబితాలపై రెండు మున్సిపాలిటీల్లో ఫిర్యాదులు వస్తున్నాయి

తండ్రి, భర్త పేర్లు లేకుండానే..

సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో విడుదలైన డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితాలో తండ్రి, భర్త పేర్లు లేకుండానే ఉన్నాయి. ఇద్దరి ఓటర్ల పేర్లు ఒకటే ఉంటే తండ్రి, భర్త పేరుతోనే గుర్తిస్తారు. ఓటర్‌ జాబితాలో వారి పేర్లే లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితా తప్పులు దొరలడం ఎలా ఉన్నా కనీసం తండ్రి, భర్త పేర్లు కూడా లేకపోవడం ఏమిటని రాజకీయపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అంశంపై కొందరు కోర్టుకు సైతం వెళ్తామని హెచ్చరించారు.

రెండు మున్సిపాలిటీల్లో 1.22 లక్షల మంది ఓటర్లు

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో 67 వార్డులు ఉన్నాయి. రెండు మున్సిపాలిటీలో డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితా ప్రకారం 122836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59522 మంది, మహిళలు 63290మంది, జెండర్లు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషులకంటే 3768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39942 మంది, మహిళలు 42011 మంది, జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19580 మంది, మహిళలు 21279 మంది, జెండర్లు 18మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1699 మంది ఎక్కువగా ఉన్నారు.

మున్సిపాలిటీలో వేడెక్కుతున్న రాజకీయం

సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలో ఈనెల10న తుది ఓటర్‌ జాబితా తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ రాబోతుందనే సంకేతాలతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, వాపక్ష పార్టీలతో పాటు స్వతంత్రంగా పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితాతో ఇంటింటికి వెళ్లి ఓటర్ల పేర్లను చూస్తున్నారు. ఇదే సమయంలో వేరే వార్డుల్లో ఉన్నవారు తమ వార్డుల్లో ఉంటే వాటిని తొలగించే విధంగా ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాలు కూడా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వార్డులో తమ పార్టీలో బలమైన అభ్యర్థులు లేని పక్షంలో ఆయా వార్డుల్లోని పలుకుబడి ఉన్న వ్యక్తులను పోటీకి సిద్ధం చేస్తున్నారు. పార్టీ ఫండ్‌ ఇచ్చి బరిలో నిలపాలని భావిస్తున్నారు. ఓటర్‌ జాబితా పూర్తి కావడంతోనే రిజర్వేషన్లు, అదే వరుసలో ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు అవుతుందని ఆశావహులు ఉత్కంఠగా ఉన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 01:14 AM