మిల్లర్లపై కేసులకు విరామం?
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:01 AM
ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వాల్సిన పలువురు రైస్‌మిల్లర్లు ఎగ్గొట్టడంతో క్రిమినల్ కేసులు పెడుతుండడంతో పలువురు మిల్లర్లు దిగివచ్చారు. బియ్యానికి బదులు 3కోట్ల రూపాయల నగదును ప్రభుత్వానికి చెల్లించారు.
- మూడు నెలల గడువు కోరిన రైస్ మిల్లర్ల సంఘం
- ఈ నెలలో ఇద్దరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు
- బియ్యంకు బదులు రూ.3కోట్లు చెల్లించిన పలువురు మిల్లర్లు
- ఇంకా రికవరీ కావాల్సినవి రూ.218.14కోట్ల విలువైన బియ్యం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వాల్సిన పలువురు రైస్‌మిల్లర్లు ఎగ్గొట్టడంతో క్రిమినల్ కేసులు పెడుతుండడంతో పలువురు మిల్లర్లు దిగివచ్చారు. బియ్యానికి బదులు 3కోట్ల రూపాయల నగదును ప్రభుత్వానికి చెల్లించారు. ఇప్పుడే క్రిమినల్ కేసులు పెట్టవద్దని మూడునెలల గడువు ఇస్తే ప్రభుత్వానికి బకాయిపడ్డ బియ్యాన్ని ఇస్తామని రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంక్షేమసంఘం ప్రతినిధులు ఇటీవల పౌరసరఫరాల కమిషనర్‌ను వేడుకోవ డంతో చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సమాచారం. జిల్లాలో ఇంకా 58మంది రైస్ మిల్లర్ల నుంచి 218కోట్ల 14లక్షల 27వేల 154రూపాయల విలువైన 57,138.162 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2014-15నుంచి 2023-24వరకు జిల్లాలోగల 146 రా రైస్, బాయిల్డ్ రైస్‌మిల్లులకు సీఎంఆర్ కింద 495కోట్ల 90లక్షల రూపాయల విలువైన ధాన్యం ఇవ్వగా, సదరు మిల్లర్లు నిర్దిష్ట గడువులోపు మర ఆడించి 2,04,700.841 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవాల్సి ఉంది. కానీ చాలామంది మిల్లర్లు సకాలంలో ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయలేదు.
ఫ పక్కదారి పట్టించారు.. విక్రయించి సొమ్ము చేసుకున్నారు..
కొందరు మిల్లర్లు ధాన్యం మర ఆడించి బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టించారు. ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులను వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. కొందరు బంగారం కొనుగోలు చేయగా, కొందరు విదేశీ ట్రిప్పులకు వెళ్లి జల్సాలకు పాల్పడ్డారని తెలుస్తున్నది. రంగు మారిన ధాన్యాన్ని ఇచ్చారని, తడిసిన ధాన్యం ఇవ్వడం వల్ల దివాలా తీశామంటూ మిల్లర్లు అధికారులకు, ప్రభుత్వానికి సాకులు చెబుతూ వచ్చారు. దీంతో పలుమార్లు మిల్లులను తనిఖీచేసిన అధికారులు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో 98రైస్‌మిల్లుల యజమానులు 277కోట్ల 76లక్షల 15వేల 915రూపాయల విలువైన 80,032.50మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 58మంది రైస్‌మిల్లర్ల నుంచి 218కోట్ల 14లక్షల 27వేల 154 రూపాయల విలువైన 57,138.162 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండడంతో, తాత్సారం చేస్తూ వచ్చారు. వారికి పలుమార్లు నోటీసులు జారీ చేసినా కూడా ధాన్యం ఇవ్వలేదు. రికవరీ చేసే విషయమై ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సదరు మిల్లర్లకు తగు సమయం ఇచ్చినా కూడా ధాన్యం డబ్బులు చెల్లించక పోవడంతో క్రిమినల్ కేసులు పెట్టడం ఆరంభించారు.
ఫ రైస్‌మిల్ యజమానులపై కేసులు పెట్టిన అధికారులు..
సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో జిల్లాలో ఈనెలలో ఇద్దరు రైసు మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పోలీసులు వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపించారు. సుల్తానాబాద్‌కు చెందిన సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ 19కోట్ల 89లక్షల రూపాయల విలువైన 6165.35మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిపడగా, ఆ మిల్లు యజమానిపై కేసు నమోదయ్యింది. అలాగే పెద్దపల్లి పట్టణంలో గల విజయశ్రీ రైస్‌మిల్లు యజమాని 4కోట్ల 49లక్షల రూపాయల విలువచేసే ధాన్యం బకాయి పడగా, అతడిపై కేసు నమోదయింది. అంతకుముందు మారుతి ఇండస్ట్రీస్ కూచిరాజ్‌పల్లి, శ్రీవెంకటసాయి ఇండస్ట్రీస్ కూచిరాజ్‌పల్లి, శ్రీలక్ష్మిప్రసన్న ఇండస్ట్రీస్ గద్దలపల్లి, పద్మావతి ఇండస్ట్రీస్ జూలపల్లి, భాగ్యలక్ష్మి రైస్‌మిల్ అల్లూరు, వీరాంజనేయ రైస్‌మిల్ రామగుండం మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, రెవెన్యూ రికవరీ యాక్టును కూడా ప్రయోగించారు. జిల్లాలో మరికొందరు రైసుమిల్లర్లపై పౌరసరఫరాల శాఖాధికారులు ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. దీంతో కొందరు మిల్లర్లు 3కోట్ల రూపాయల నగదు ప్రభుత్వానికి చెల్లించారు. బియ్యం ఇచ్చేందుకు తమకు మూడుమాసాల గడువు ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు పౌరసరఫరాలశాఖ కమిషనర్ దృష్టికి తీసుకవెళ్లడంతో వారి సూచనల మేరకు జిల్లా అధి కారులు మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సమా చారం. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ రెడ్డిని వివరణ కోరగా, కేసుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉన్నాయని అన్నారు.