Share News

సిరుల పంట

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:08 AM

యాసంగిలో రైతులు అంచనాలకు అనుగుణంగా దిగుబడులు సాధించారు.

 సిరుల పంట

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

యాసంగిలో రైతులు అంచనాలకు అనుగుణంగా దిగుబడులు సాధించారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. ఐదు కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం కొంటున్నారు. ఆయా గ్రామాల ధాన్యం పూర్తికాగానే కొనుగోలు కేంద్రాలను మూసివేస్తారు. ఈ యాసంగి సీజన్‌లో 2.6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 6.5 లక్షల టన్నుల నుంచి ఏడు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో విత్తనపు పంట, రైతుల సొంత అవసరాలకు మినహాయించుకునే ధాన్యం పోను 3.67 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వస్తారని, సుమారు లక్ష టన్నుల ధాన్యం ప్రైవేట్‌లో విక్రయిస్తారని భావించారు. ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ సంస్థ ద్వారా 91, ప్రాథమిక వ్యసాయ సహకార సంఘాల ద్వారా 178, డీసీఎంఎస్‌ ద్వారా 39, హాకా ద్వారా 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 317 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 312 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన నాలుగు, డీసీఎంఎస్‌కు చెందిన ఒక కేంద్రంలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఒకటిరెండు రోజుల్లో ధాన్యం అమ్మకాలు పూర్తవుతాయని భావిస్తున్నారు.

అంచనాలకు అనుగుణంగా..

ఇప్పటి వరకు జిల్లాలో 52,372 మంది రైతులకు చెందిన 822.22 కోట్ల రూపాయల విలువ చేసే 3,46,603 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 47,504 మంది రైతులకు చెందిన 3,13,537 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన 746.25 కోట్ల రూపాయలు సివిల్‌ సప్లయిస్‌ శాఖ చెల్లించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 75.97 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటికి తెరిచి ఉన్న కొనుగోలు కేంద్రాలు మూసివేసే వరకు 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు అంచనా వేసినట్లుగానే కొనుగోళ్లు జరిగాయి. 3.67 లక్షల టన్నుల అంచనాకు గాను 3.50 లక్షల టన్నుల కొనుగోళ్ళు జరుగుతాయని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను కొంత ఆలస్యంగా ప్రారంభించినా అకాల వర్షాలు ఎక్కువగా పడకపోవడం, రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఎక్కువగా నష్టపోకుండా కొనుగోళ్లు పూర్తవుతున్నాయని సంతోసిస్తున్నారు.

అందని సన్న వరి బోనస్‌ :

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5,574 మెట్రిక్‌ టన్నుల సన్న రకం వరిధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున బోనస్‌ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. రైతులు అమ్మిన సన్న వరి ధాన్యానికి 2.79 కోట్ల రూపాయలు బోనస్‌ ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి బోనస్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాలేదు.

మక్కల కొనుగోళ్లు పూర్తి

యాసంగిలో జిల్లాలో 32,300 పైచిలుకు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల చొప్పున భారీగా దిగుబడి వచ్చింది. తొమ్మిది లక్షల క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చినా ఎకరాకు 26 క్వింటాళ్లే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. జిల్లాలో ఏడు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసింది. కొనుగోళ్లలో జాప్యం జరగడంతో రైతులు ప్రైవేట్‌లోనే 1800 రూపాయలకు క్వింటాల్‌ చొప్పున విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు 2,400 రూపాయలు ఉన్నా కొనుగోలు చేసే వారు లేక కేంద్రాల్లో పడిగాపులు కాయడం కంటే ప్రైవేట్‌లో అమ్ముకోవడం మేలనుకున్న రైతులు తక్కువ ధరకే అమ్మేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చొప్పదండి, జమ్మికుంట, గన్నేరువరం, మల్లాపూర్‌, చిగురుమామిడి, సైదాపూర్‌, కరీంనగర్‌ కొనుగోలుకేంద్రాల్లొ 2,79,384 క్వింటాళ్ల మక్క జొన్నలను కొనుగోలు చేశారు. వీటికి మాత్రమే కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించగా మిగతా రెండు వంతుల మక్కలను రైతులు ప్రైవేటులోనే అమ్ముకోవలసి వచ్చింది.

Updated Date - Jun 12 , 2026 | 01:08 AM