బాలికలకు వరం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:45 AM
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు మరికొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించేందుకు తయారు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
- సర్వైకల్, ఇతర క్యాన్సర్‌లకు చెక్
- జిల్లాలో 14, 15 సంవత్సరాల బాలికలకు వ్యాక్సినేషన్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు మరికొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించేందుకు తయారు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఆడపిల్లలకు వరంగా భావించే ఈ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌లో శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 14, 15 సంవత్సరాల బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను అందించి వారు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
ఫ జిల్లావ్యాప్తంగా 9,935 మంది బాలికలు
జిల్లావ్యాప్తంగా 14, 15 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు 9,935 మంది ఉన్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరందరికి త్వరలోనే వైద్యుల పర్యవేక్షణలో హెచ్‌పీవి (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 6 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ధర ఉన్న ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇస్తున్నది.
ఫ మూడు డోసులు
వైద్యుల పర్యవేక్షణలో మూడు డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నెలరోజులకు రెండో డోసు, ఆ తర్వాత ఆరు నెలలకు మూడోది బూస్టర్ డోసును ఇస్తారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ల నివారణకు ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో భారత్ క్యాన్సర్ బాధితుల సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యేటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారినపడుతుండగా 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లుగా గుర్తించారు. దేశంలో క్యాన్సర్ వ్యాధిని నివారించే కార్యక్రమంలో భాగంగా మహిళలకు గర్భాశయ క్యాన్సర్‌లు, ఇతర మరికొన్ని క్యాన్సర్లు రాకుండా చూసేందుకు హెచ్‌పీవీ టీకా సత్పలితాలనిస్తుందని ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు నిర్ధారించాయి. ఈ వ్యాక్సిన్‌ను బాలికలకు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే జిల్లాలో ఈ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది.
--------------------