సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్‌ల రికవరీ
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:15 AM
పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెలికితీయడంలో సీఈఐఆర్ పోర్టల్ సాంకేతికతను కరీంనగర్ పోలీసులు సమర్థవంతంగా వినియోగిస్తూ బాధితులకు ఊరట కలిగిస్తున్నారు.
కరీంనగర్ క్రైం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెలికితీయడంలో సీఈఐఆర్ పోర్టల్ సాంకేతికతను కరీంనగర్ పోలీసులు సమర్థవంతంగా వినియోగిస్తూ బాధితులకు ఊరట కలిగిస్తున్నారు. బుధవారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్‌కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొని, సుమారు 18 లక్షల 20 వేల రూపాయల విలువ కలిగిన 91 రికవరీ సెల్‌ఫోన్‌లను బాధితులకు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఫోన్లను ట్రేస్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన రూరల్ పోలీస్‌స్టేషన్ టెక్నికల్ టీమ్ సభ్యులు కానిస్టేబుళ్లు విశ్వతేజ, రాంసాయి, కీర్తనలను ప్రత్యేకంగా అభినందించారు. టెక్నికల్ టీం కృషిని గుర్తించి వారికి త్వరలోనే రివార్డులు అందజేయాలని అధికారులకు సీపీ సూచించారు. 2025 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబరు 29వ తేదీ వరకు సీఈఐర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా కరీంనగర్ కమిషనరేట్ సాధించిన పురోగతిని సీపీ వివరించారు. ఏడాదిలో మొత్తం 6,700 ఫిర్యాదులు అందగా, 3,939 ఫోన్‌లు గుర్తించామని, ఇందులో 2,056 ఫోన్లను బాధితులకు అప్పగించినటట్లు తెలిపారు. మరో 1,883 ఫోన్‌లు రికవరీ ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. ఫోన్ల రికవరీలో 52 శాతం సక్సెస్ సాధించినట్లు సీపీ తెలిపారు. జిల్లాలో మానకొండూర్ పోలీస్‌స్టేషన్- 75 శాతం రికవరీ, కరీంనగర్ రూరల్-73 శాతంతో అత్యుత్తమ ఫలితాలు సాధించగా, చొప్పదండి, ఇల్లందకుంట, రామడుగు స్టేషన్లు 70 శాతం రికవరీతో మెరుగ్గా నిలిచాయన్నారు. కరీంనగర్ వన్‌టౌన్ అత్యధికంగా 1,011 ఫోన్లను గుర్తించి రికార్డు సృష్టించిందని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు నరేష్, లక్ష్మారెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.