Share News

80శాతం పూర్తయిన వరినాట్లు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:59 PM

వానాకాలం సాగులో భాగంగా హుజూరాబాద్‌ డివిజన్‌లో రైతులు 80శాతం వరకు వరినాట్లు పూర్తి చేశారు.

80శాతం పూర్తయిన వరినాట్లు..
హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లిలో నాటు వేస్తున్న మహిళా కూలీలు

హుజూరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగులో భాగంగా హుజూరాబాద్‌ డివిజన్‌లో రైతులు 80శాతం వరకు వరినాట్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క చెరువు, కుంటలోకి పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చిన దాఖాలాలు లేవు. వర్షాలపైనే రైతులు ఆశలు పెట్టుకొని బావులు, బోర్లలో ఉన్న నీటితో వరినాట్లు వేశారు. వర్షాలు కురుస్తాయనే ఆశతోనే వేలాది రూపాయలు ఖర్చు చేసి పొలాలు దున్ని వరి సాగు చేస్తున్నారు. డివిజన్‌లో ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. డివిజన్‌లో హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్‌, శంకరపట్నం మండలాలున్నాయి. 1.2 లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంది. ఇందులో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఎక్కువ మొత్తంలో సాగు భూములున్నాయి. వర్షాలు పడుతాయనే ఉద్దేశంతో రైతులు నారుమళ్లు పోశారు. ఈసరిఇ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయి. గత సంవత్సరం రెండు పంటలకు ఆయకట్టు ద్వారా నీళ్లు ఇవ్వడంతో భూగర్భజలాలు అడుగంటి పోలేదు. మెట్ట ప్రాంతంలో మాత్రం భూగర్భజలాలు అడుగంటి పోయాయి. చిరు వర్షాలకు రైతులు తమ పొలాలను దున్నుకొని వరి పంటలను సాగు చేస్తున్నారు. ఎకరానికి విత్తనాలు, దుక్కి దున్నడం, ఎరువులు, కూలీలకు 18 వేల వరకు ఖర్చు చేశారు. దేవుడి మీద భారం వేసి రైతులు ఇప్పటి వరకు వరినాట్లు పూర్తి చేశారు. మున్ముందు వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంటలు పండుతాయి. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Updated Date - Aug 18 , 2026 | 11:59 PM