కోటి రూపాయలతో 17 ఓపెన్ జిమ్‌లు
ABN , Publish Date - May 06 , 2026 | 12:19 AM
కోటి రూపాయలతో నగరంలో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు.
కరీంనగర్ రూరల్, మే 5 (ఆంధ్రజ్యోతి): కోటి రూపాయలతో నగరంలో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం కిసాన్‌నగర్, దుర్శేడ్‌లో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిట్ ఇండియా నినాదాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ప్రజలకు ఓపెన్ జిమ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కోటి రూపాయల వ్యయంతో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటుచేయన్నుట్లు తెలిపారు. నాల్కో సంస్థ అందిస్తున్న సీఎస్సార్ నిధుల సహకారంతో మలయప్ప ఫౌండేషన్ నిర్వాహకులు ఈ ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా నగరంలోని కిసాన్‌నగర్ అంబేద్కర్ యూత్ క్లబ్ సమీపంలో, దుర్శేడులో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఓపెన్ జిమ్‌లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప, మలయప్ప ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ గడ్డం అరుంజయ్, గడ్డం అనూష పాల్గొన్నారు.