హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:21 AM
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామంలోని ఒకే కులానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారితీయగా ఈ కేసులో నిందితులైన 15 మందికి జీవితఖైదుతోపాటు రూ.1,500 చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు.
కరీంనగర్ క్రైం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామంలోని ఒకే కులానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారితీయగా ఈ కేసులో నిందితులైన 15 మందికి జీవితఖైదుతోపాటు రూ.1,500 చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లికి చెందిన ఒక వర్గం మ్యాకల ఇంటిపేరుతో, మరో వర్గం బొజ్జ ఇంటి పేరుతో రెండు గ్రూపులుగా ఉన్నాయి. గ్రామ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడిగా బొజ్జ తిరుపతి(48) బొజ్జ వర్గానికి ప్రాథినిథ్యం వహిస్తున్నాడు. అయితే గ్రామంలోని చెరువులో చేపలు పట్టుకునే విషయంలో ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరి ఫిర్యాదులతో కేసులు కూడా నమోదయ్యాయి. చామనపల్లి పరిధిలో రాజసముద్రం, అప్పనపల్లి చెరువులు ఉండగా గ్రామ మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం నుంచి మ్యాకల ఇంటిపేరుతో ఉన్న వారిని తొలగించారు. సంఘంలో సభ్యత్వం వారే చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు బొజ్జ తిరుపతి హైకోర్టు, మత్స్యశాఖ కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్నాడు. దీంతో మ్యాకల ఇంటిపేరుతో ఉన్న గ్రూపునకు సంఘంలో సభ్యత్వం లేనందున చేపలు పట్టుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో మ్యాకల ఇంటిపేరుతో ఉన్న గ్రూపు సభ్యులు బొజ్జ తిరుపతిపై కక్ష పెంచుకున్నారు. కాగా అప్పనపల్లి చెరువులో నీరు తగ్గుతుండడంతో చేపలకు ప్రమాదం ఉందని బొజ్జ తిరుపతి ఆ చెరువు పక్కన ఉన్న ప్రతాపరెడ్డి అనే రైతు వ్యవసాయ బావి నుంచి నీటిని చెరువులోకి పంపించేందుకు అతడితో మాట్లాడాడు. 2019 ఏప్రిల్ 19న సాయంత్రం బొజ్జతిరుపతి, బొజ్జ లచ్చయ్య. బొజ్జ పోచయ్యతో కలిసి చెరువు వద్దకు వ్యవసాయబావి నుంచి పైపులైన్ వేసేందుకు వెళ్లాడు. బొజ్జ తిరుపతి చెరువు వద్దకు వచ్చినట్లు తెలుసుకున్న మ్యాకల ఇంటిపేరుతో ఉన్న గ్రూపునకు చెందిన వారు బొజ్జ తిరుపతిని ఎలాగైనా చంపాలని పథకం వేశారు. ఈ మేరకు మ్యాకల ధర్మరాజం(80), మ్యాకల రాములు(56), మ్యాకల పోచయ్య(42), మ్యాకల కొంరయ్య(58), మ్యాకల అంజనేయులు(36), మ్యాకల వెంకటేశం(50), మ్యాకల నవీన్(35), మ్యాకల ప్రవీణ్(38), మ్యాకల శ్రీనివాస్(తండ్రి కొంరయ్య)(34), మ్యాకల శ్రీనివాస్(27)(తండ్రి రాములు, మ్యాకల సంపత్(27), మ్యాకల లచ్చయ్య(50) మ్యాకల శ్రీనివాస్(29) (తండ్రి వెంకటేశం), మ్యాకల సత్తయ్య(40) మ్యాకల వెంకటరాజం(60)తోపాటు మైనర్ బాలుడు(16) బొజ్జ తిరుపతి తలపై రాళ్లతో దాడిచేసి మెడకు కండువా బిగించి హత్య చేశారు. ఈ సంఘటనపై మృతుడు తిరుపతి భార్య బొజ్జ సమత ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ పోలీసులు 16 మందిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి సీఐ కె.శశిధర్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. సీఎంఎస్‌ఎస్‌ఐ సత్తయ్య, సీవీవో ఎం.రాజేందర్ ఈ కేసులో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్ సాక్షులను విచారించి వాధించారు. సాక్షాధారలు పరిశీలించిన జడ్జి శివకుమార్, పై 15 మంది నిందితులకు జీవిత ఖైదు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మరో నిందితుడు బాల నేరస్థుడు కావడంతో అతడిపై కేసు జువైనల్ కోర్టులో విచారణలో ఉంది.
ఫ బొజ్జ తిరుపతి హత్య కేసులో నిందితులు 15 మందికి జీవితఖైదు శిక్ష పడిన విషయం తెలుసుకున్న నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. బొజ్జ తిరుపతి హత్య కేసులో సోమవారం వాదనలు ఉండడంతో బెయిల్‌పై ఉన్న నిందితులు ఇంటి వద్ద నుంచి కోర్టుకు హాజరయ్యారు. తుది తీర్పు వెలువడే అవకాశం ఉందనే సమాచారంతోనే నిందితుల కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో సహా కోర్టు వద్దకు చేరుకున్నారు. శిక్ష ఖరారు కాగానే విషయం తెలసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే పోలీసులు జైలుకు తరలించేందుకు కోర్టు ప్రధాన ద్వారం నుంచి బయటకు వస్తారని అక్కడేవేచి ఉండగా పోలీసులు వారిని మరో గేట్ ద్వారా కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. కరీంనగర్ జిల్లా జైలులో 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడిన ఖైదీలను మాత్రమే రిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో సోమవారం కరీంనగర్ జైలులో తాత్కాలికంగా రిమాండ్ ఖైదీలుగా తీసుకున్న జైలు అధికారులు మంగళవారం ఆ 15 మంది నిందితులను హైదరాబాద్ చర్లపల్లి జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ నేరస్థులకు శిక్షలు పడేలా పోలీసు యంత్రాంగం శ్రమిస్తుంది : సీపీ
నేరస్థులకు శిక్షలు పడేలా పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని సీపీ గౌస్ ఆలం అన్నారు. హత్య కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన నాటి కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ నిరంజన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ రాజేందర్, సీఎంఎస్‌ఏఎస్‌ఐ సత్తయ్యను ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు.