Share News

వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:20 AM

ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్నందున లక్ష్యంమేరకు వందశాతం ఆస్తిపన్నులను వసూలు చేయాలని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు.

వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్నందున లక్ష్యంమేరకు వందశాతం ఆస్తిపన్నులను వసూలు చేయాలని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కళాభారతి ఆడిటోరియంలో కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఉదయమే బృందాల వారీగా క్షేత్రస్థాయికి వెళ్లి పన్నులు వసూలు చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలతో మర్యాదగా వ్యవహరించి ఆస్తిపన్నుల అవసరాలపై అవగాహన కల్పించాలని అన్నారు. పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి దోహదపడాలని మేయర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆస్తిపన్నుల వసూళ్లకు పాలకవర్గ సభ్యులు అధికారులకు సహకారాన్ని అందించాలని కోరారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచాలని, పన్నులు చెల్లించకుంటే మున్సిపల్‌ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. 26 రోజుల్లో రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు లక్ష్యంతో ముందుకెళ్లి 30 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్నుల డిమాండ్‌ నోటీసులు జారీ చేయాలని, వాటి గురించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ బకాయిదారులకు నోటీసులు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. టమొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్లు, విద్యుత్‌ కనెక్షన్లను తొలగించాలని అధికారులకు సూచించారు. వ్యాపారులు పన్నులు చెల్లించకుంటే దుకాణాలను సీజ్‌ చేయడంతోపాటు ఆర్వో యాక్ట్‌ను అమలు చేయాలని సూచించారు. మార్చి 15లోగా లక్ష్యం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణం చేయని ఇళ్ల నంబర్లను తొలగించాలని, వసూలు చేయలేని పన్నుల వివరాలను అందించాలని ఆదేశించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం, వడ్డీ మాఫీ స్కీం వంటివాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, గడువులోగా పన్నులను చెల్లించాలని కోరారు. క్యాపిటల్‌ వ్యాల్యూ ప్రకారం ఆస్తిపన్నులు అప్‌డేట్‌ చేశామని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని, డిమాండ్‌ నోట్‌ ప్రకారంగా గడువులోగా ఆస్తిపన్నులను ప్రతి ఒక్కరూ చెల్లించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్‌, ఖాదర్‌ మొహియుద్దీన్‌, ఏసీపీ రాజ్‌కుమార్‌, ఆర్‌వోలు, ఆర్‌ఐలు, టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:20 AM