ఆడాలని ఉన్నా..
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:42 AM
విద్యార్థులకు క్రీడలతో శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం కలుగుతుంది. అంతేకాకుండా పరీక్షలు, చదువుల సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించి ప్రశాంతతను క్రీడలు కలిగిస్తాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
విద్యార్థులకు క్రీడలతో శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం కలుగుతుంది. అంతేకాకుండా పరీక్షలు, చదువుల సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించి ప్రశాంతతను క్రీడలు కలిగిస్తాయి. క్రీడలతో శారీరక శ్రమ ఏర్పడి మెదడుకు రక్తప్రసరణ బాగా జరగడంతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కూడా క్రీడల వల్ల కలుగుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాల స్థాయి వరకు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలపై ఆసక్తి పెంపొందించిన ఇంటర్ విద్యకు చేరుకోగానే క్రీడలు దూరమవుతున్నాయి. జిల్లాలో పది కళాశాలల్లో ఒక్క ఫిజికల్ డైరెక్టర్ కూడా లేడు. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ కళాశాలకు వెళ్లలేక పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో వివిధ ఆటలు ఆడాలని ఆసక్తి ఉన్నా ఆడించేవారు లేక నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం క్రీడల సామగ్రి కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు కేటాయిస్తున్నా ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడంతో జూనియర్ కాలేజీల్లో ఆటలు విద్యార్థులకు అందని ద్రాక్షలా మారాయి.
జిల్లాలో 10 జూనియర్ కళాశాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉండగా, 2730 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 1594 మంది ఉండగా, బాలికలు 1136 మంది ఉన్నారు. జిల్లా కేంద్రంలో రెండు జూనియర్ కళాశాలు ఉండగా, కోనరావుపేట, ఇల్లంతకుంట, వేములవాడ, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రతి జూనియర్ కళాశాలకు సొంత భవనం, ఆటస్థలాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విద్యార్థులు క్రీడలకు మాత్రం దూరమవుతున్నారు. ప్రభుత్వం 2026-27 సంవత్సరం కోసం ప్రతి కళాశాలకు రూ.25వేల చొప్పున క్రీడా నిధులను కూడా మంజూరు చేసింది. ఈ నిధులతో ఆటలు ఆడించేందుకు ఔట్‌డోర్, ఇండోర్ క్రీడల కోసం వాలీబాల్, రింగ్‌బాల్, స్కిప్పింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్, షటిల్, టెన్నిస్, ఫుట్‌బాల్, చెస్ బోర్డులు, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి కిట్లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సామగ్రిని కొనుగోలుకు నిధులు ఇచ్చినా శిక్షణను అందించడానికి ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడంతో క్రీడా నిధులు మంజూరు చేసినా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదని విమర్శలు ఉన్నాయి.
ఫ ఫిజికల్ డైరెక్టర్ల నియామకాలు లేవు..
జిల్లాలో విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో శిక్షను అందించడానికి నియమించే ఫిజికల్ డైరెక్టర్ల నియామకాలు చేపట్టక దాదాపు 20 ఏళ్లు గడిచిపోతోంది. 2006 సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీ పోస్టుల భర్తీకి సంబంధించి చివరిసారిగా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటివరకు మళ్లీ నియమాకాలు చేపట్టలేదు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలో, కేజీబీవీ తదితర విద్యాసంస్థల్లో ఆటల నిర్వహణకు కాంట్రాక్ట్ పద్ధతిపై నియామకాలు చేపడుతున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం నియమించడం లేదు. గతంలో పాఠశాల విద్యా శాఖ ద్వారా పీటీలకు ఫిజికల్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించేవారు. ఈ ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. విద్యార్థులకు వివిధ ఆటల్లో రాణించాలని తపన ఉన్నా ఆడించేవారు లేక నిరాశపడుతున్నారు. జాతీయస్థాయిలో క్రీడల్లో రాణించాలని ఆసక్తి చూపుతున్నా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించే వారు లేక విద్యార్థులు చదువులకే పరిమితం అవుతున్నారు. ఇంటర్ విద్య ఉన్నత అధికారులు కూడా దృష్టి సారించడం లేదని విమర్శలు ఉన్నాయి.
ఫిజికల్ డైరెక్టర్ బాధ్యతలు లెక్చరర్లకే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్కరు కూడా ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడంతో విద్యార్థులను ఆటలు ఆడించే బాధ్యత కూడా లెక్చరర్లకే అప్పగించారు. వివిధ క్రీడలు ఆడించే ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడంతో విద్యార్థులకు కాస్త అనుభవం ఉన్న లెక్చరర్లే విద్యార్థులకు దిక్కుగా మారారు. లెక్చరర్లు కూడా వారికి ఆసక్తి ఉన్న క్రీడలను నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం ఆటలు ఆడించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ బాఽధ్యతలను ఆసక్తి ఉన్న లెక్చరర్లకు అప్పగించారు. క్రీడా బాధ్యతలతో విద్యాబోధనపై ప్రభావం పడుతోందని తెలుస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు
ప్రభుత్వ కళాశాల బాలురు బాలికలు మొత్తం
సిరిసిల్ల 459 205 664
సిరిసిల్ల (బాలికల) 00 302 302
కోనరావుపేట 144 54 198
ఇల్లంతకుంట 201 55 256
వేములవాడ 235 150 385
చందుర్తి 166 38 204
రుద్రంగి 08 52 150
గంభీరావుపేట 96 141 237
ముస్తాబాద్ 95 35 130
ఎల్లారెడ్డిపేట 100 104 204
మొత్తం 1594 1136 2730