Share News

విచారణకు పిలవడం తప్పుకాదు

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:46 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్‌ విచారణకు పిలవడం తప్పేమీ కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

విచారణకు పిలవడం తప్పుకాదు

  • కేసీఆర్‌ సహా చట్టానికి ఎవరూ అతీతులు కాదు

  • ప్రజా జీవితంలో అన్నింటినీ ఎదుర్కోవాల్సిందే

  • కేటీఆర్‌ దీనిని నేరం, ఘోరం అనడం సరికాదు

  • స్టాండ్‌వేసి సైకిల్‌ తొక్కినట్లుగా సిట్‌ విచారణ

  • బీఆర్‌ఎస్‌ నేతతో సర్కారు మ్యాచ్‌ ఫిక్సింగ్‌

  • మంచోడైనా, చెడ్డోడైనా ఓటు వేయాలనడం..కేటీఆర్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనం

  • పెట్టుబడులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం

  • డొల్ల కంపెనీల పేరిట ఫేక్‌ ఎంవోయూలు

  • రేవంత్‌ హార్వర్డ్‌ చదువుకు ఫీజెవరు కట్టారు?

  • ప్రజల కోసం తెలంగాణ జాగృతి పోరాటాలు నిర్వహించనుంది: కవిత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్‌ విచారణకు పిలవడం తప్పేమీ కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కేసీఆరైనా, ఇంకెవరైనా.. విచారణకు పిలిస్తే వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేక అంశాలు వస్తుంటాయని, వాటిని ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నారు. కేసీఆర్‌ పదేళ్లు సీఎంగా ఉన్నారు కాబట్టే విచారణకు పిలిచారని, కానీ.. కేటీఆర్‌ దీనిని నేరం, ఘోరం అన్నట్లుగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. అసలు విచారణకే పిలవద్దనడం సరికాదన్నారు. ఇలాంటి ఆలోచనలు మారకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కేసీఆర్‌ను విచారణకు పిలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో బీఆర్‌ఎస్‌ ఆలోచించుకోవాలని సూచించారు. తాను తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లానని, ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు పిలిచినా వెళతానని చెప్పారు. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిజమైన నేరస్తులు బయటకు వస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ప్రస్తుతం సిట్‌ విచారణ తీరును చూస్తుంటే.. సైకిల్‌ స్టాండు వేసి తొక్కినట్లుగా ఉందన్నారు.


బీఆర్‌ఎస్‌ నేతతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌..

ఒక బీఆర్‌ఎస్‌ నేతతో కాంగ్రెస్‌ సర్కారు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని కవిత ఆరోపించారు. మునిసిపల్‌ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు ఇటు తిప్పుతున్నారని, నిజంగా కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా కేసు ఎందుకు ముందుకు పడటంలేదని ప్రశ్నించారు. కేసును సాగదీయకుండా విచారణను ముగింపు దశకు తేవాలని డిమాండ్‌ చేశారు. మునిసిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా, చెడ్డోడైనా కేసీఆర్‌ను చూసి ఓటు వేయాలని కేటీఆర్‌ చెప్పడం సరికాదని కవిత అన్నారు. ఇది వారి నియంతృత్వ, రాచరిక పోకడలకు నిదర్శనమన్నారు. గుడ్డిగా లేబుల్‌ చూసి ఓటువేస్తే నష్టపోతామన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున కొన్నిచోట్ల అభ్యర్థులను బరిలో నిలిపామని తెలిపారు. ఇక విదేశీ పర్యటనలు చేసి, గ్లోబల్‌ సమ్మిట్‌లు నిర్వహించి.. డొల్లకంపెనీల పేర్లు చెబుతూ.. వాటిద్వారా రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులం టూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నదంతా ఫేక్‌ ప్రచారమని కవిత ఆరోపించారు. అమెరికాకు చెందిన ట్రంప్‌ మీడియా టెక్నాలజీసంస్థ మొత్తం మార్కెట్‌ వ్యాల్యూనే రూ.30 వేల కోట్లు అని, అలాంటి సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని ప్రశ్నించారు. ఏడీఐజీసీ సింగపూర్‌ గేట్‌వే అనే సంస్థ డేటాసెంటర్‌ ద్వారా రూ.67 వేల కోట్ల పెట్టుబడులు అంటున్నారని, కానీ.. ఆ సంస్థకు కనీసం వెబ్‌సైట్‌ కూడా లేదని చెప్పారు.

పెట్టుబడుల ఎంవోయూలన్నీ ఫేక్‌..

ఇన్‌ఫ్రా కీ డేటా సెంటర్‌పార్క్‌ అనే సంస్థ రూ.70వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పారని, కానీ.. ఈ కంపెనీని గతేడాది మే నెలలోనే పెట్టారని కవిత వెల్లడించారు. ఈ సంస్థ అమెరికాలో రూ.90 వేల కోట్లు, బ్రెజిల్‌ ప్రభుత్వంతో రూ.70వేల కోట్లతో ఎంవో యూ చేసుకుందని తెలిపారు. ఈ సంస్థను కేవ లం ఎంవోయూల కోసమే పెట్టారా? లేదంటే బ్యాంక్‌లను మభ్య పెట్టే పనిచేస్తున్నారా? అన్నది ప్రజలకు చెప్పాలన్నారు. ‘‘బ్రూక్‌ఫీల్డ్‌ యాక్సెస్‌ సంస్థ రూ.75 వేల కోట్ల పెట్టుబడి అన్నారు. అదే సంస్థకు చెందిన మరో సంస్థ రూ.25 వేల కోట్ల పెట్టుబడి అని చెప్పారు. కానీ, ఈ సంస్థ మార్కెట్‌ వ్యాల్యూ కన్నా కూడా చాలా ఎక్కువ పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఇక ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి సంస్థ కూడా రూ.5,600 కోట్ల పెట్టుబడులు అన్నారు. ఇది నిజమైన కంపెనీయేనా? భరత్‌ గరుడ రూ.2100 కోట్లు, ఎస్‌ఎల్‌ఆర్‌, ఆర్సీటీ అనే సంస్థలు దాదాపు 2వేల కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ సంస్థల ఫెడ్‌ఆఫ్‌ క్యాపిటల్‌ రూ.10 లక్షలు కూడా లేదు. వారికి వెబ్‌సైట్‌ కూడా లేదు. ఉర్సా క్లస్టర్స్‌ అనే కంపెనీ కథ మరీ విచిత్రంగా ఉంది. ఆ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడి పెడతామని ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాతే కంపెనీ పెట్టింది. మేం ఇవన్నీ రీసెర్చ్‌ చేసి కంపెనీల వివరాలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తాం. ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ సర్కారు తీరుపై ‘హ్యాష్‌ట్యాగ్‌ కాంగ్రెస్‌ ఫేక్‌ ఎంవోయూలు’ పేరుతో తెలంగాణ యువత సామాజిక మాధ్యమాల్లో బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగానే పెట్టుబడులు వస్తే.. వాటి వివరాలు చెప్పాలి. వాటి ద్వారా ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో కూడా కాంగ్రెస్‌ సర్కారు చెప్పాలి’’ కవిత అన్నారు.


కేంద్ర బడ్జెట్‌.. తెలంగాణకు మోసం..!

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రజలను బీజేపీ దారుణంగా మోసం చేసిందని కవిత ఆరోపించారు. మొత్తం రూ.53 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్య, వైద్యానికి ఒక్కశాతం నిధులు కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని, కేంద్రం ఈ వైఖరిని మార్చుకోవాలని అన్నారు. మోదీ తనకు బడేభాయ్‌ అంటూ 30సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం.. కనీసం రూ.30 వేలకోట్లు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ఓవైపు ఇచ్చిన హామీలను పట్టించుకోని కాంగ్రెస్‌, మరోవైపు బీఆర్‌ఎస్‌ రాచరిక పోకడలు, తెలంగాణకు రూపాయి కూడా బీజేపీ ఇవ్వని పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం యువత, మహిళలు, మేధావులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ఈ నెల 20 తర్వాత తిరిగి కొనసాగించనున్నట్లు కవిత వెల్లడించారు.

రేవంత్‌కు హార్వర్డ్‌ ఫీజు ఎవరు కట్టారు?

హార్వర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లి పట్టా అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ కోర్సుకు ఫీజు ఎవరు కట్టారో చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. సింగరేణి నుంచి కట్టారా? లేక ఎవరైనా బిజినె్‌సమేన్‌ కట్టారా? అని ప్రశ్నించారు. సీఎంను హార్వర్డ్‌ యూనివర్సిటీ వాళ్లే కోర్సు చదివేందుకు ఆహ్వానించారా? ఆయనే దరఖాస్తు చేసుకున్నారా? అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలన్నారు. నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. కాంగ్రెస్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు. ఇంతకుముందు రూబీ హోటల్‌, దక్కన్‌ మాల్‌, స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ గుల్జార్‌హౌ్‌సలో, ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నపిల్లలు చనిపోయారని, సీఎం రేవంత్‌రెడ్డి వారిని కనీసం పరామర్శించలేదని విమర్శించారు. సీఎం పీఆర్‌ స్టంట్లు మానేసి.. సెల్లార్‌లో జరిగే బిజినెస్‌, పాత బిల్డింగ్‌లను పర్యవేక్షించాలని హితవు పలికారు. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్యపై దాడి జరిగితే సీఎం కనీసం స్పందించలేదని, ఆమె చనిపోయిన తర్వాత మాత్రం ట్వీట్‌ చేశారని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో నేరాలు పెరిగాయని, ఏడాదిలోనే 69 హత్యలు, 176 హత్యాయత్నాలు జరిగాయని కవిత పేర్కొన్నారు. దీనికితోడు గన్‌కల్చర్‌ కూడా పెరిగిపోయిందని, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మాత్రం మేల్కొనడం లేదని విమర్శించారు.

Updated Date - Feb 03 , 2026 | 02:46 AM