Share News

బీఆర్‌ఎస్‌కు కవిత మాస్టర్‌ స్ట్రోక్

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:10 AM

పార్టీ ఆవిర్భావ సభలో కవిత తన పార్టీ పేరును తొలుత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పూర్తిగా చెప్పలేదు! ‘టీఆర్‌ఎస్‌’ అనే పదే పదే చెప్పారు...

బీఆర్‌ఎస్‌కు కవిత మాస్టర్‌ స్ట్రోక్

  • పేరుపై చివరిదాకా గోప్యత పాటించి షాక్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఆవిర్భావ సభలో కవిత తన పార్టీ పేరును తొలుత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పూర్తిగా చెప్పలేదు! ‘టీఆర్‌ఎస్‌’ అనే పదే పదే చెప్పారు! తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) అనే పేరును కూడా ఆమె వ్యూహాత్మకంగానే నిర్ణయించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్‌ఎస్‌ రాష్ట్రం సాధించాక రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌గా మార్చారు. అప్పటి నుంచి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న టీఆర్‌ఎస్‌ పేరు ఖాళీగానే ఉంది. అందుకే, టీఆర్‌ఎస్‌ పేరు ఇప్పుడు ఖాళీగా ఉందని, దానిని ఎవరైనా వాడుకోవచ్చని ఇటీవల కవిత నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశారు. నిజానికి, గ్రామీణ ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పేరుకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. బీఆర్‌ఎస్‌ కంటే టీఆర్‌ఎస్‌నే ఇంటి పార్టీగా గుర్తిస్తారు. అందుకే.. గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలోని పార్టీ అభిమానుల నుంచి వస్తున్న సూచనల మేరకు బీఆర్‌ఎస్‌ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్పు చేయాలని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోందని ఇటీవల కేటీఆర్‌ తెలిపారు కూడా. అయితే, ఇప్పుడు అదే పేరుతో కవిత పార్టీని ప్రకటించడం కేసీఆర్‌, కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను షాక్‌కు గురి చేసిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారకుండా ఆమె చెక్‌ పెట్టారని విశ్లేషిస్తున్నారు. దీంతో, పార్టీ పేరు మార్చాలన్న బీఆర్‌ఎస్‌ నాయకుల ఆలోచనలకు బ్రేక్‌ పడినట్లేనని ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరుతోనే షాకిచ్చిన ఆమె.. ఇక ముందు బీఆర్‌ఎస్‌ పార్టీని ఏవిధంగా ఇరుకున పెడతారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలు తమదిగా భావించిన టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ దూరం చేసుకుంటే.. ఆయన కూతురు కవిత మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని జాగృతి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


చివరి వరకూ గోప్యత

కవిత పెట్టబోయే పార్టీకి సంబంధించి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఎన్నికల సంఘం గుర్తింపు కోసం జాగృతి శ్రేణులు దరఖాస్తు చేసుకున్న టపేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి (టీపీజే)’. తమ పార్టీ పేరు అదేనని ప్రచారం చేశారు. జాగృతి వర్గాలతో జరిపిన అంతర్గత సమావేశాల్లోనూ టీపీజేగానే ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే, తమ పార్టీ పేరుపై గోప్యత పాటిస్తూ వచ్చిన కవిత.. ఆవిర్భావ సభలో ఎవరూ ఊహించని రీతిలో.. టీఆర్‌ఎస్‌గా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ముందుగా బయటకు తెలిస్తే.. బీఆర్‌ఎస్‌ అడ్డుకునే అవకాశం ఉంటుందనే ఆమె తన పార్టీ పేరును ఎవరికీ చెప్పలేదని అంటున్నారు. ఇక, తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కొత్త పార్టీకి ఎన్నికల సంఘం అనుమతి దక్కలేదని, అందుకే, గతంలో మరొకరి ద్వారా నమోదు చేయించిన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) పేరును పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో ప్రకటించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

పేరులో అసోసియేషన్‌ ఎందుకు!?

కవిత తన పార్టీ పేరును ‘టీఆర్‌ఎస్‌’గా ప్రకటించారు. కానీ, కాస్త సునిశితంగా గమనిస్తే పేరులో కింద ‘అసోసియేషన్‌’ అనే పదం కూడా కనిపిస్తోంది. పార్టీ పేరులో ఈ అసోసియేషన్‌ ఎందుకనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. తన పార్టీ పేరు టీఆర్‌ఎస్‌గా కొనసాగేందుకు బీఆర్‌ఎస్‌, ఇతర రాజకీయ వర్గాల నుంచి అడ్డంకులు ఎదురైతే.. లేదా గతంలో ఉన్న పార్టీ పొడి అక్షరాలను ఎన్నికల సంఘం అనుమతించని పరిస్థితి వస్తే.. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కవిత ప్లాన్‌-బిని సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. అందులో భాగంగానే.. పార్టీ జెండాలో టీఆర్‌ఎస్‌ అనే పేరున్న చోట కిందనే అసోసియేషన్‌ అంటూ చిన్న అక్షరాలతో రాయించారని, ఇబ్బందులు ఏర్పడితే.. టీఆర్‌ఎస్‌ (ఏ)గా ఆమె తన పార్టీని కొనసాగిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


ఒరిజినల్‌ ఎప్పటికీ ఒరిజినలే! కవిత కొత్త పార్టీపై బీఆర్‌ఎస్‌ సెటైర్లు

కవిత తన పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా ప్రకటించడంతో సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ ట్రోలింగ్‌ మొదలు పెట్టింది. ఒరిజినల్‌ ఎప్పటికీ ఒరిజినలే అంటూ సెటైర్లు ప్రారంభించింది. తమ పార్టీ పేరును ఆమె కాపీ కొట్టిందనే అర్థం వచ్చేలా పార్టీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ఒరిజినల్‌ కోల్గేట్‌, డూప్లికేట్‌ కోల్గేట్‌ పేస్ట్‌, బిస్లరీ ఒరిజినల్‌, డూప్లికేట్‌ బిస్లరీ బాటిళ్ల ఫోటోలను పక్కపక్కనే పెట్టి వ్యంగ్యంగా స్పందించింది.

Updated Date - Apr 26 , 2026 | 05:10 AM