హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంప పెట్టు!
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:52 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దన్న హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డి సర్కారు....
చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయండి: హరీశ్‌రావు
హైదరాబాద్/ సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దన్న హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డి సర్కారుకు చెంపపెట్టు అని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణాధారమని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తే భయపడేది లేదని స్పష్టంచేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వమే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపి, జీవో కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకు ఎలాంటి విలువ లేదని, ముందుగా గోదావరి- బనకచర్ల లింకుద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపులాపూర్ పంచాయతీ పరిధిలోని ఎదుల్లావాడ గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో హరీశ్‌రావు బుధవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలకు ముగింపు: కేటీఆర్
కాళేశ్వరం పథకంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు హైకోర్టు తీర్పుతో ముగింపు లభించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం హైకోర్టు తీర్పు తర్వాత తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డికి, కేంద్రానికి సంబంధం లేకపోతే ఓటుకు నోటు కేసును సొలిసిటర్ జనరల్ ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఏనాటికైనా కాంగ్రెస్‌ను 15 కిలోమీటర్ల లోతులో బొందపెట్టి బీజేపీలో చేరడం ఖాయమని అన్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై కాంగ్రెస్ దుర్మార్గులే ఏదో కుట్రచేసి ఉంటారని, ఆ విషయం కూడా నిలకడగా తెలుస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్ న్యాయమైనదేనని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్ పార్టీ నైతిక మద్దతు తెలుపుతుందని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌చేసిన వ్యాఖ్యలు గల్లీలో కార్పొరేటర్ మాట ల్లా ఉన్నాయ విమర్శించారు. ఆ మూటలను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిది కాదా? అని ప్రశ్నించారు. అమృత్ పథకం నుంచి సింగరేణి వరకు ప్రతి విషయంలో కుంభకోణాలు జరుగుతుంటే కిషన్‌రెడ్డి మౌనంగా ఉంటూ కాంగ్రెస్ మంత్రులతో కలిసి తిరుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.