అది.. కుటుంబ, వారసత్వాన్ని కాపాడుకునే మార్చ్
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:46 AM
దేశవ్యాప్తంగా ‘ఇండీ’ కూటమి చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ, వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు.
కాంగ్రెస్ ‘సేవ్ డెమోక్రసీ’పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపాటు
తెలంగాణలో ‘ఆర్‌ఆర్’ రాజ్యాంగం నడుస్తోందా? అని ప్రశ్న
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ‘ఇండీ’ కూటమి చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ, వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పదే పదే ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ నాయకులు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అభివృద్ధిని, ప్రజాదరణను ఎదుర్కోలేక, ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే నైతిక ధైర్యం లేకనే కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ చోరీ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన (ఎస్‌ఐఆర్)లో భాగంగా డూప్లికేట్, చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు కడుపుమంటతో రగిలిపోతోందని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ‘ఆర్‌ఆర్ రాజ్యాంగం’ నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి ఈ రాజ్యాంగ విరుద్ధ చేష్టలు కనిపించడం లేదా అని నిలదీశారు.