ఉద్యమ నేతగా కేసీఆర్‌తో సమస్య లేదు
ABN , Publish Date - May 16 , 2026 | 04:31 AM
ఉద్యమనేతగా రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిపెట్టిన కేసీఆర్‌తో ఎలాంటి సమస్యాలేదని.. సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనే తనతో పాటు చాలామందికి సమస్య వచ్చిందని తెలంగాణ రక్షణసేన....
సీఎం, బీఆర్‌ఎస్ అధినేతతోనే సమస్య!
మద్యం స్కాం కేసు సమయంలో తల్లిగారి ఇంటి నుంచి నాకు మద్దతు లభించలేదు
అత్తగారి కుటుంబమే అండగా నిలబడింది
బండి సంజయ్ కుమారుడి కేసులో రేవంత్ తీరును మహిళలు గమనిస్తున్నారు
క్యాబినెట్ నుంచి బండిని తప్పించాలి
దీనిపై ప్రధాని మోదీకి లేఖరాస్తా: కవిత
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): ఉద్యమనేతగా రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిపెట్టిన కేసీఆర్‌తో ఎలాంటి సమస్యాలేదని.. సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనే తనతో పాటు చాలామందికి సమస్య వచ్చిందని తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. కుటుంబసభ్యులు తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చుననని.. అయితే ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు సమయంలో తనకు తల్లిగారి ఇంటి నుంచి సరైన మద్దతు లభించలేదని చెప్పారు. ఆ సమయంలో అత్తగారి కుటుంబమే తనకు అండగా నిలబడి, తనలో ఎంతో దైర్యం నింపిందని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. అధికారం తెలంగాణ రక్షణసేన పార్టీదేనని.. తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచినట్లుగానే తెలంగాణలో తమ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. రాజకీయాల్లో కచ్చితంగా వ్యూహాలు ఉండాలని, అవి తాను కేసీఆర్ వద్దే నేర్చుకున్నానని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మద్యం విధానం కుంభకోణం పేరుతో బీజేపీ తనను, కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాల్జేయాలని చూసిందని, అయితే ఆ ఆరోపణలను కోర్టు తోసిపుచ్చిందన్నారు. చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులను చూశాకే తనలో మార్పు వచ్చిందని, ఎవరికి నచ్చకపోయినా సరే మనకు నచ్చింది చేయాలని తాను గుర్తించానన్నారు. భగీరథ్ మీద వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్ చేయకుండా రేవంత్‌రెడ్డి మేలుచేసి పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు తెలంగాణ మహిళలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు. కేంద్రమంత్రి పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదని, విచారణ పూర్తయ్యేదాకా బండి సంజయ్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్‌ను తప్పించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. అమ్మతనంతో పాలన జరిగినప్పుడే సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందని, తాను అక్కగా కన్నా అమ్మగా పరిణతి చెందాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. తనకు ఎన్టీఆర్, కేసీఆర్, ఇందిరాగాంధీ, సుష్మాస్వరాజ్, మార్గరేట్ థాచర్ ఇష్టమైన నాయకులని చెప్పారు.