మీడియం లేకుండానే జేఎన్‌టీయూ సర్టిఫికెట్లు!
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:10 AM
అవసరం ఉన్నా లేకున్నా రకరకాల ఫీజుల పేరిట విద్యార్థుల జేబుకు జేఎన్‌టీయూ చిల్లు పెడుతోందా..!
మీడియం లేకుండానే జేఎన్‌టీయూ సర్టిఫికెట్లు!
వర్సిటీ తీరుతో విద్యార్థుల ఇబ్బందులు
విడిగా మీడియం సర్టిఫికెట్‌కు రూ.200 వసూలు
3 రోజుల పాటు ప్రదక్షిణలు.. విద్యార్థుల జేబుకు చిల్లు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): అవసరం ఉన్నా లేకున్నా రకరకాల ఫీజుల పేరిట విద్యార్థుల జేబుకు జేఎన్‌టీయూ చిల్లు పెడుతోందా..! అంటే అవుననే అంటున్నారు విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఇస్తున్న సర్టిఫికెట్‌లో మీడియం ప్రస్తావన ఉంటుండగా, జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో బీటెక్, ఎంటెక్ వంటి పలు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మీడియం ప్రస్తావన లేకుండానే డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సమస్య ఎదురువుతోంది. సర్టిఫికెట్లలో మీడియం ప్రస్తావన లేకపోవడంపై అక్కడి విశ్వవిద్యాలయాలు, వివిధ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రుల ద్వారా మీడియం సర్టిఫికెట్ల కోసం జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఈ అగచాట్ల సంగతి తెలిసి.. విదేశాలకు వెళదామనుకుంటున్న విద్యార్థులు జాగ్రత్త పడుతున్నారు. ప్రతి నెలా వందలాది మంది మీడియం సర్టిఫికెట్ కోసం పరీక్షల విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం ‘ది మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది ఎబౌ కోర్స్ ఈజ్ ఇంగ్లిష్’ అని ముద్రించి ఇచ్చే సర్టిఫికెట్‌కు ప్రతీ విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించిన రసీదును అందజేసి, కనీసం మూడు రోజుల పాటు తిరిగితే కానీ మీడియం సర్టిఫికెట్ చేతికి అందడం లేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ దీనిపై దృష్టి సారించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణమోహనరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా వైస్‌చాన్సలర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు