Share News

మద్యం దుకాణాలు బినామీల గుప్పిట్లో

ABN , Publish Date - May 14 , 2026 | 04:38 AM

రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు పాతరేస్తూ అక్రమాలకు అడ్డాగా మారారు. సిండికేట్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

మద్యం దుకాణాలు బినామీల గుప్పిట్లో

  • అసలైన యజమానులను పక్కనపెట్టి చక్రం తిప్పుతున్న పెట్టుబడిదారులు

  • రిజర్వు చేసిన దుకాణాలు అత్యధికం సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన వైనం

  • సిండికేట్లుగా మారి నిబంధనలకు తూట్లు.. స్టాక్‌ రిజిస్టర్‌ లేదు.. ఐటీ ఫైలింగ్‌ లేదు

  • ఎక్సైజ్‌, పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తూ బినామీల దందా!

  • తక్కువ విక్రయాలు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరు

  • ఐటీ బినామీ నిషేధ యూనిట్‌ అధికార్ల సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు పాతరేస్తూ అక్రమాలకు అడ్డాగా మారారు. సిండికేట్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్‌ పొందిన దగ్గర్నుంచి విక్రయాల వరకు ప్రతి దశలోనూ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. లబ్ధిదారుల పేర్లను కేవలం దరఖాస్తులకే పరిమితం చేసి, వెనుక నుంచి పెట్టుబడిదారులు చక్రం తిప్పుతున్నారు. ఆదాయపన్ను (ఐటీ) శాఖ ‘బినామీ నిషేధ యూనిట్‌ (బీపీయూ)’ విభాగం అధికారులు రెండు మూడు రోజులుగా రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి వంటి ప్రాంతాల్లోని వైన్‌ షాపులపై నిర్వహించిన సోదాల్లో బినామీల గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించి బీపీయూ ఆధారాలు సేకరించింది.

అంతేకాకుండా.. పలువురు మద్యం దుకాణాల నిర్వాహకులు తమ అసలు ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను భారీగా ఎగ్గొడుతున్నట్లు తేలింది. వాస్తవానికి రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మద్యం దుకాణాల రిజర్వేషన్‌ పాలసీని ప్రవేశపెట్టింది. అయితే దీనిని మద్యం సిండికేట్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల్లో అత్యధిక చోట్ల బినామీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వ్‌ చేసిన 30 శాతం దుకాణాల్లో ఈ అక్రమాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్‌ కోటాను సిండికేట్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంతో అసలైన యజమానులు కేవలం నామమాత్రపు వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి.. సంపన్న వ్యాపారులు వారికి ఎంతో కొంత గుడ్‌విల్‌గా ఇచ్చేసి సిండికేట్లుగా చక్రం తిప్పుతున్నారు. ఎస్సీ, బీసీ కేటగిరీల కింద లైసెన్సులు పొందిన వారిలో అత్యధికులు ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేయడంలేదు.


ఐటీ ఫైలింగ్‌ లైసెన్స్‌దారులు..

మల్కాజిగిరిలో ఎస్సీ, బీసీ కేటగిరీ కింద ఉన్న 20షాపుల్లో 10 మంది లైసెన్స్‌ దారులు ఐటీ ఫైలింగ్‌ చేయలేదు. మేడ్చల్‌లో 17 షాపుల్లో 14 మంది, సరూర్‌నగర్‌లో ఎస్సీ, ఎస్టీ, గౌడ వర్గాలకు కేటాయించిన 35 దుకాణాల్లో 21 మంది, యాదాద్రి భువనగిరిలో తనిఖీ చేసిన 29 షాపుల్లో 21 మంది పన్ను చెల్లించడంలేదని తేలింది. ఎటువంటి ఆదాయ వనరులు లేని ఈ వ్యక్తుల ఖాతాల నుంచి రూ.కోట్లలో డిపాజిట్లు చెల్లించడం, భారీ స్థాయి మద్యం స్టాక్‌ కొనుగోలు చేయడం ఐటీ అధికారులను విస్మయానికి గురిచేసింది. చందానగర్‌కు చెందిన చింతకింది సురేశ్‌ కేసు ఈ అక్రమాలకు కీలక మలుపుగా మారింది. ఎటువంటి ఆదాయం లేని వ్యక్తి పేరుతో ఉన్న మద్యం దుకాణం కోసం గత డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో రూ.23.8 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసు మూలాలను వెతుకుతూ వెళ్లగా.. సింధూర్‌ వైన్స్‌, స్పిరిట్‌ నేషన్‌ వంటి ఇతర సంస్థలతోనూ లింకులు ఉన్నట్లు తేలింది. దీంతో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30శాతం రిజర్వేషన్ల పాలసీని సిండికేట్లు తమ స్వలాభానికి వాడుకుంటున్నట్లు తేటతెల్లమైంది. ఎక్సైజ్‌, పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లిచ్చి బినామీల దందాను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

రికార్డుల నిర్వహణ అట్టర్‌ ఫ్లాప్‌..

మద్యం దుకాణాల్లో విక్రయాలు పారదర్శకంగా సాగాలంటే స్టాక్‌ రిజిస్టర్ల నిర్వహణ అత్యంత కీలకం. కానీ, తాజా తనిఖీల్లో చాలా దుకాణాల్లో అసలు స్టాక్‌ రిజిస్టర్లే నిర్వహించడంలేదని తేలింది. నగదు లావాదేవీలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంతో పాటు అసలు ఐటీ ఫైలింగ్‌ కూడా చేయకుండా యజమానులు దర్జాగా వ్యాపారాలు కానిచ్చేస్తున్నారు. కనీసం ఆయా దుకాణాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? వారి వివరాలు ఏంటి? అనే నౌకర్‌నామా రిజిస్టర్లు కూడా లేకపోవడం గమనార్హం. నిఘా పెట్టిన ఐటీ విభాగం కేవలం రెండు మూడు రోజులు నిర్వహించిన సోదాల్లోనే కళ్లు బైర్లుకమ్మే అక్రమాలు బయటపడటంతో మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా పండుగలు, వారాంతాల్లో వచ్చే భారీ ఆదాయాన్ని రికార్డుల్లో చూపకుండా తక్కువ ఆదాయం చూపిస్తున్న వ్యాపారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. డిజిటల్‌ పేమెంట్లను పక్కన పెట్టి.. కేవలం నగదు రూపంలో వచ్చే ఆదాయాన్ని చాలా తక్కువగా చూపిస్తూ ఐటీ అదికారులను బురిడీ కొట్టిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. మద్యం డిపోల నుంచి కొనుగోలు చేసే స్టాక్‌ కంటే అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తెప్పించి విక్రయిస్తున్నట్లుగా సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తప్పుడు బిల్లులు సృష్టించడం, నిబందనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. నిబంధనలు పాటించకుండా తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఆడాయానికి గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఐటీ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయనే ప్రచారంతో మద్యం సిండికేట్లలో ఆందోళన మొదలైంది.

Updated Date - May 14 , 2026 | 08:57 AM