Share News

ఇక హరీశ్‌ రావు వంతు..?

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:01 AM

బీఆర్‌ఎస్‌ అగ్రనేతల నియోజకవర్గాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టార్గెట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో గత బుధవారం భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌ ప్రస్తుతం సిద్దిపేటపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది

ఇక హరీశ్‌ రావు వంతు..?
harishrao

  • వచ్చేవారం సిద్దిపేటలో సీఎం రేవంత్‌ పర్యటన

  • అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభ

  • సిరిసిల్ల సభ నేపథ్యంలో చర్చనీయాంశంగా పర్యటన

  • హరీశ్‌ ఆస్తులపై సీఎం మాట్లాడతారంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అగ్రనేతల నియోజకవర్గాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టార్గెట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో గత బుధవారం భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌ ప్రస్తుతం సిద్దిపేటపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ అగ్రనేతల్లో ఒకరైన హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో సీఎం రేవంత్‌ వచ్చే వారం పర్యటిస్తారని సమాచారం. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఒక రోజుసిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని సమాచారం. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతల అక్రమ ఆస్తుల వివరాలను బయటపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెర తీశారు. ఈ క్రమంలో గత బుధవారం సిరిసిల్లలో పర్యటించిన సీఎం రేవంత్‌.. అక్కడ నిర్వహించిన సభలో కేటీఆర్‌ ఆస్తులపై మాట్లాడారు. కేటీఆర్‌కు అమెరికా, సింగపూర్‌లలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. అలాగే, హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో రూ.వేల కోట్ల విలువైన మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కేటీఆర్‌, ఆయన భార్య, అత్త పేరిట ఉన్నాయని, అది అసత్యమైతే తన పేరు మార్చుకోవడానికి సిద్ధమని సవాలు కూడా చేశారు. దీంతో కేటీఆర్‌ ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. మరోపక్క సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటనలపై రెండ్రోజులుగా కేటీఆర్‌ వివరణలు ఇస్తున్నారు.


అలాగే, సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి మంత్రి అవుతారని ప్రకటించిన ముఖ్యమంత్రి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా సిరిసిల్ల పర్యటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపిన సీఎం రేవంత్‌ ప్రస్తుతం హరీశ్‌ రావుపై దృష్టి పెట్టారని అంటున్నారు. బీఆర్‌ఎ్‌సకు కంచుకోట లాంటి సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, పర్యటనకు ముగింపుగా సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని చెబుతున్నారు.. అయితే సిరిసిల్ల సభలో కేటీఆర్‌ ఆస్తులపై సంచలన ప్రకటనలు చేసిన సీఎం రేవంత్‌.. సిద్దిపేటలో హరీశ్‌రావు ఆస్తులపై మాట్లాడతారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్దిపేటను కైవసం చేసుకునే లక్ష్యానికి సంబంధించిన కార్యాచరణ ఈ పర్యటనతోనే మొదలవుతుందని పేర్కొంటున్నాయి.

Updated Date - Oct 03 , 2026 | 06:07 AM