నారీశక్తితో వాయుసేన బలోపేతం
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:17 AM
పెరుగుతున్న నారీశక్తి భాగస్వామ్యం భారత వైమానిక దళాన్ని మరింతగా బలోపేతం చేసి, శక్తిమంతమైన సంస్థగా తీర్చిదిద్దుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భారత వైమానిక దళం దేశ రక్షణకు కవచం.. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చాలి
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్
శిక్షణ పూర్తిచేసినవారికి ప్రెసిడెంట్స్ కమిషన్
అల్వాల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న నారీశక్తి భాగస్వామ్యం భారత వైమానిక దళాన్ని మరింతగా బలోపేతం చేసి, శక్తిమంతమైన సంస్థగా తీర్చిదిద్దుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యుద్ధభూమిలో కేవలం పెద్ద దేశాలకే ఆధిక్యం ఉండే కాలం చెల్లిపోయిందని.. చిన్న దేశాలు సైతం ప్రత్యేక వ్యూహాలతో పెద్ద దేశాలను దెబ్బకొట్టగలవని ఆయన పేర్కొన్నారు. గతంలో సైనికులు ఆయుధాలతో యుద్ధాలు చేసేవారని.. కానీ, కొత్త సాంకేతికతలు యుద్ధ స్వరూపాన్నే మార్చేశాయని అన్నారు. ఇప్పుడు రేడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి వ్యవస్థలతో యుద్ధాలు చేస్తున్నారని.. శత్రువుల ట్రాఫిక్ వ్యవస్థలు, సీసీటీవీలను సైతం అధీనంలోకి తెచ్చుకునే పరిస్థితులను ఇప్పుడు మనం చూస్తున్నామని గుర్తుచేశారు. యుద్ధాల నిర్వచనం మారిపోయింది కాబట్టి.. సాయుధ దళాలలో కొత్తగా చేరేవారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానసికంగా సిద్ధంగా ఉండాలని, ఆధునిక యుద్ధతంత్రాలను, వ్యూహాలను అర్థం చేసుకుని.. అవసరమైతే కొత్త వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం శత్రువుల మౌలిక సదుపాయాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసి సత్తా చాటిందని గుర్తుచేశారు. స్వదేశీ సాంకతిక పరిజ్ఞానంతో, అంకిత భావంతో పనిచేసే సిబ్బంది వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, భవిష్యత్‌లో కూడా వైమానిక దళం ఇదేవిధంగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వాయుసేన దేశానికి ఎల్లప్పుడూ రక్షణనిచ్చే కవచంలా, ఖడ్గంలా దాడిచేసే శక్తిగా సేవలందిస్తుందన్నారు. కాగా.. 2025 మే 30న ఎన్‌డీఏ నుంచి ఉత్తీర్ణులైన మహిళా కేడెట్స్ అనంతరం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శాఖలవారీగా ప్రత్యేక శిక్షణ పొంది అధికారులుగా కమిషన్ పొందారు. ఐఎఎఫ్ చరిత్రలో ఎన్‌డీఏ నుంచి వచ్చిన మహిళా కేడెట్స్ అధికారులుగా నియమితులవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ వారిని ప్రశంసించారు. అలాగే.. 231 మంది ఫ్లయిట్ కేడెట్స్ (వారిలో 194 మంది పురుషులు, 37 మంది మహిళలు)కు ప్రెసిడెంట్ కమిషన్, వింగ్స్, బ్రెవెట్స్ ప్రదానం చేశారు. ఆయన్నుంచి వింగ్స్ అందుకున్నవారిలో ఐదుగురు మహిళలు, 9 మంది భారత నౌకాదళ అధికారులు, ముగ్గురు భారత్ కోస్ట్‌గార్డ్ అధికారులు, వియత్నాం దేశానికి చెందిన ఇద్దరు అధికారులు ఉన్నారు. మరో ముగ్గురు అధికారులు నావిగేషన్ శిక్షణ పూర్తి చేసి బ్రెవెట్స్‌ను పొందారు. ప్లయింగ్ బ్రాంచ్ నుంచి ప్లయింగ్ ఆఫీసర్ ఆశీష్ కుమార్ యాదవ్‌కి పైలట్ కోర్స్‌లో మొదటి స్థానంలో నిలిచినందుకు ప్రెసిడెంట్ ప్లాక్‌తో పాటు చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ (కరవాలం), నేవిగేషన్ స్ట్రీమ్‌లో మొదటి స్థానంలో నిలిచిన ప్లయింగ్ ఆఫీసర్ ఎక్తాగుప్తాకు, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ కోర్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన ప్లయింగ్ ఆఫీసర్ దివ్యాన్షిసింగ్‌కు ప్రెసిడెంట్ ప్లాక్‌లను రక్షణ మంత్రి అందించారు. అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ రాహుల్‌భాసిన్ గ్రాడ్యుయేటింగ్ అధికారులతో ప్రమాణం చేయించారు. పరేడ్ అనంతరం ప్రదర్శించిన వైమానిక విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. ముఖ్యంగా.. వాయుసేనకు చెంది ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ నిర్వహించిన డ్రిల్ విశేషంగా ఆకట్టుకుంది.