పెళ్లి భోజనాలపై యుద్ధ ప్రభావం.. వంటగ్యాస్ కొరతతో కష్టకాలం
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:38 AM
దక్షిణాసియాలో జరుగుతున్న యుద్ధం శుభకార్యక్రమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పెళ్లికి నలుగురుని పిలిచి భోజనం పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
18న పెళ్లిళ్ల సీజన్ మొదలు
వచ్చే వారం వేలాదిగా పెళ్లిళ్లు
ఇప్పటికే తగ్గిన ఎల్‌పీజీ నిల్వలు
కమర్షియల్ సిలిండర్ల బుకింగ్ క్లోజ్
విందులకు కట్టెల పొయ్యిలే దిక్కు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
దక్షిణాసియాలో జరుగుతున్న యుద్ధం శుభకార్యక్రమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పెళ్లికి నలుగురుని పిలిచి భోజనం పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎల్‌పీజీ కొరత రోజు రోజుకు తీవ్రంగా ఉండటం, కట్టెలకు కూడా డిమాండ్ పెరగడంతో పెళ్లిళ్లకు వచ్చే అతిథులకు భోజనాలు పెట్టగలుగుతామా.. లేదా? అని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ బుకింగ్ దాదాపు నిలిపివేయడంతో వంట గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడుతున్న విషయం తెలిసిందే. గ్యాస్ కొరత తీవ్రత రోజు రోజుకు పెరగడంతో వివాహ శుభకార్యాలతో పాటు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు ఇతర ఫంక్షన్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈనెల 18నుంచి మంచి ముహుర్తాలు ఉండటంతో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఫిబ్రవరి 18 నుంచి మే నెల 9 వరకు వివాహ ముహుర్తాలు ఎక్కువగా ఉన్నాయి. మే నెల 17 నుంచి జూన్ 15 వరకు అధిక మాసం వల్ల ముహూర్తాలు లేవు. దీని తరువాత మళ్లీ ముహుర్తాలు ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. మరోవైపు ఇప్పటికే వేల మంది ఫంక్షన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు శుభకార్యక్రమాలు జరుపుకొనేందుకు అంతగా అనుకూలత కనిపించడం లేదు. ఇప్పటికే ఫంక్షన్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ బుకింగ్ నిలిపివేయడంతో కేటరింగ్ నిర్వాహకులు తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చే ఆలోచనలో కేటరింగ్ నిర్వాహకులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. శుభకార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిన వారు పెళ్లిళ్లు ఇతర శుభకార్యక్రమాలకు వచ్చే అతిధులకు పసందైన విందు భోజనాలు పెట్టగలమా? అనే విషయంలో ఆందోళనతో ఉన్నారు. వివాహం జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొందరు వివాహ ముహుర్తాలను కూడా మార్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీఐపీ ఫంక్షన్లకు శివార్లే అడ్డా..
వివాహ వేడుకలు, ఫంక్షన్లకు నగర శివారు ప్రాంతాలే కేరాఫ్ అడ్రస్! రాష్ట్రంలో అత్యధిక ఫంక్షన్ హాళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. సాధారణ ప్రజలతో పాటు ధనవంతులు శుభకార్యాలు జరుపుకొనేందుకు వారి అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. ఖరీదైన రిసార్ట్‌లు, ఐదు నక్షత్ర హోటళ్లు ఉన్నాయి. రోజుకు రూ. కోటి వరకు అద్దె వసూలు చేసే ఫంక్షన్లు హాళ్లు శివార్లలో అనేకం ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎక్కువ మంది తమ కుటుంబ ఫంక్షన్లు శివార్లలోని ఫంక్షన్ హాళ్లలో జరుపుకొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2వేలకుపైగా చిన్న, పెద్ద ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు సీజన్ కావడంతో ఇవన్నీ కూడా జూన్ వరకు బుక్ అయ్యాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రతి ఫంక్షన్ హాళ్లు ఒకేరోజు రెండు లేదా అంత కంటే ఎక్కువ ఫంక్షన్లు జరుపుకొనేందుకు బుక్ అయ్యాయి. వేసవి కావడంతో రాత్రి ఫంక్షన్ల కోసం ఏసీ రూమ్‌లు కంటే ఆరుబయట లాన్‌లో వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఫిబ్రవరిలోనే ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కేవలం ఫంక్షన్ హాళ్లలో 15వేల వరకు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా. ఇక రిసార్ట్‌లు, ఫామ్ హౌస్‌లు ఇళ్ల వద్ద కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
ఉపాధిపై తీవ్ర ఫ్రభావం
పెళ్లిళ్ల సీజన్ మొదలైతే ఎన్నో వర్గాల వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ నిర్వాహకులు, పురోహితులు, కేటరింగ్,. పూల అలంకరణ, ఫొటో, వీడియోగ్రాఫర్లు, వాయిద్య కళాకారులు, బ్యూటీ పార్లర్, షామీయానా టెంట్ నిర్వాహకులు, ట్రావెల్ ఏజెన్సీలతో పాటు అనేక వర్గాల వారికి చేతి నిండా పని ఉంటుంది. యుద్ధ ప్రభావంతో వీరందరి ఉపాధిపై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.