ప్రాజెక్టుల భూసేకరణకు 5 వేల కోట్లు
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:27 AM
రాష్ట్రంలో ప్రాజెక్టుల భూసేకరణకు రానున్న బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించనున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
సింగూరు ఆనకట్ట రక్షణకు ప్రాధాన్యం: ఉత్తమ్
హైదరాబాద్/హుజూర్‌నగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాజెక్టుల భూసేకరణకు రానున్న బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించనున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆ నిధులతో భూసేకరణను వేగిరం చేసి, ప్రాజెక్టుల పనులు చేపడతామన్నారు. జూన్ 2వ తేదీలోపు భూసేకరణను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. బుధవారం సచివాలయంలో వివిధ ప్రాజెక్టులపై ఆయన మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్కలతో విడివిడిగా సమీక్షలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్యామ్‌సేఫ్టీ ఆర్గనైజేషన్ సిఫారసుల ప్రకారం సింగూరు ఆనకట్ట రక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్వ మెదక్ జిల్లాకు సాగునీటితో పాటు హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటిని అందించే సింగూరు కట్ట రక్షణ కోసం ప్రస్తుతం నీటి లోపల తనిఖీలు జరుగుతున్నాయన్నారు. మరమ్మతు పనులను వేగిరం చేస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్షిస్తూ.. భూసేకర ణ వల్లే ప్రాజెక్టులు ఆగిపోయాయని గుర్తించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల భూసేకరణ అత్యంత ప్రాధా న్యం ఇస్తున్నామ ఆయన చెప్పారు. ఇక పాలెంవాగు ప్రాజెక్టు గేట్లు, రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తన ఓఎస్డీ భీంప్రసాద్‌ను మంత్రి ఆదేశించారు.
రంగనాయకసాగర్ రిజర్వాయర్ కింద ఆయకట్టును స్థిరీకరించాలి: ఎంపీ చామల
రంగనాయకసాగర్ నుంచి డీ-10 కెనాల్ కింద సిద్దిపేట జిల్లా కమలాయపల్లి, అర్జున్‌పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూ ర్, ధూల్మిట్ట గ్రామాల పరిధిలోని 7 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. వేసవిలో చెరువులకు నీటిని సరఫరా చేసి, సాగునీటిని అందించాలని, శాశ్వత నీటి కేటాయింపు కోసం జీవో జారీ చేయాలని కోరారు.
14న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. బుధవారం హుజూర్‌నగర్‌లోని ఫణిగిరిగట్టు వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్‌కాలనీలో మొత్తం 2వేల ఇళ్లు ఉండగా, తొలివిడతగా 1,000ఇళ్లను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.