మూడంతస్తులకు అనుమతి తీసుకుని ఏడంతస్తుల నిర్మాణం
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:59 AM
హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఘోరం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఓ భవనం ఏడో అంతస్తుపై నుంచి కిందపడి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు.
భవనంపై నుంచి పడి ఇద్దరు కార్మికుల మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాద్ టోలిచౌకిలో ఘటన
కార్వాన్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఘోరం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఓ భవనం ఏడో అంతస్తుపై నుంచి కిందపడి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. అల్‌హస్నత్ కాలనీలో యునైటెడ్ కన్స్‌స్ట్రక్షన్స్ కంపెనీకి చెందిన నాసర్ సులేమాన్ 300 గజాల స్థలంలో జీ+3 అంతస్తులకు అనుమతి తీసుకుని జీ+7 భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఏడో అంతస్తు పైభాగంలో గురువారం ఎలివేషన్ పనులను చేస్తుండగా రక్షణగా ఏర్పాటు చేసిన కర్రలు ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేస్ర్తీ ఆదినారాయణ (50), కార్మికుడు తిరుపతిరావు (31) అక్కడికక్కడే మృతి చెందగా, విజయనగరం జిల్లాకు చెందిన ఆర్. రమేశ్ (32), ఎం. రమేశ్ (34) తీవ్రంగా గాయపడ్డారు. వారు భవనంపై నుంచి కింద ఉన్న ఓ ఆటోపై పడడంతో అందులో ఉన్న బండ్లగూడకు చెందిన ఆటో డ్రైవర్ లాల్ అహ్మద్‌ఖాన్ (40) కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. గాయపడిన వారు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుందరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని గమనించిన గోల్కొండ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనునాయక్ బిల్డర్‌కు నోటీసులు అందజేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.