Share News

మూడోసారి ప్రజల్లోకి ప్రభుత్వం

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:35 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం మూడో సారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు....

మూడోసారి ప్రజల్లోకి ప్రభుత్వం

  • ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్‌ 2న గ్రామ సభలు

  • ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యం

  • 99రోజుల యాక్షన్‌ ప్లాన్‌కు ప్రత్యేక లోగో

హైదరాబాద్‌, మార్చి5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం మూడో సారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామ సభల నిర్వహణకు మరోమారు సిద్ధమవుతోంది. ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ పేరిట చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఏప్రిల్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించనుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబరు 28 నుంచి 2024 జనవరి 6 వరకు తొలిసారి ప్రజా పాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. ఆ తర్వాత 2025 జనవరి 26 నుంచి మూడు రోజుల పాటు రెండోసారి ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలను నిర్వహించింది. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి నుంచి అర్జీలు స్వీకరించటంతోపాటు ప్రజలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలోని సమస్యలను తెలుసుకుంది. ఈ రెండు విడతల్లోనూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలతోనే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసిందని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంఓ) వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మూడో విడతగా ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ పేరుతో మరోమారు ప్రజల్లోకి వెళ్లనుంది. మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, సంక్షేమం, అలైవ్‌ అరైవ్‌, పిల్లల భద్రత-డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, విద్య, యువత-క్రీడలు, మహిళా సంక్షేమం, పర్యావరణం అనే 10 థీమ్‌లతో 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనుంది. విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆయా విభాగాలకు నోడల్‌ అధికారులను కూడా నియమించింది. ప్రజాప్రతినిధులు అందరినీ ఆయా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చెయ్యాలని కూడా ఆదేశించింది. ఇక, ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా లోగోను కూడా రూపొందించింది. యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా నిర్వహించే కార్యక్రమాల వద్ద ఈ లోగోను ప్రదర్శిస్తారు.

Updated Date - Mar 06 , 2026 | 03:35 AM