Share News

అజెండా లేకుండానే భేటీకి!

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:22 AM

జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ భేటీకి అజెండా లేకుండానే హాజరు కావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

అజెండా లేకుండానే భేటీకి!

  • రేపే జల వివాదాలపై సీడబ్ల్యూసీ చైర్మన్‌ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సమావేశం

  • అజెండా పంపని తెలంగాణ.. అదే బాటలో ఏపీ

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ భేటీకి అజెండా లేకుండానే హాజరు కావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. దీంతో 24వ తేదీలోగా అజెండాను పంపించాలని కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాలను కోరినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ అజెండా పంపించకపోవడంతో ఏపీ కూడా మౌనం వహించింది. ఈ భేటీకి ఏపీ నుంచి జలనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, నీటిపారుదల శాఖ సలహాదారు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌.. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌, ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్‌సీ (జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌తోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్‌ ఇంజనీర్‌ హాజరుకానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంలతో నిర్వహించిన సమావేశంలో సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం ఆధారంగానే ఈ కమిటీ ఏర్పాటైంది. ఇక ఇప్పటికే పోలవరం-బనకచర్ల/నల్లమల్ల సాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ ప్రక్రియతో పాటు ఆ ప్రాజెక్టు అక్రమ నిర్మాణానికి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను, ఆ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక మదింపునకు సీడబ్ల్యూసీ చేపట్టిన ప్రక్రియను తక్షణమే విరమించుకుంటేనే కమిటీ సమావేశానికి హాజరవుతామని తెలంగాణ ఇదివరకే తేల్చి చెప్పింది. డీపీఆర్‌ తయారీ, పీఎ్‌ఫఆర్‌ మదింపు వంటి ప్రక్రియలు జరిగిపోయాక చర్చలు జరిపినా ఫలితం ఉండదని, ఇలాంటి స్థితిలో సమావేశానికి రాలేమని స్పష్టం చేసింది. ఇక ఏపీ ప్రాజెక్టులే లక్ష్యంగా తెలంగాణ.. తెలంగాణలోని ప్రాజెక్టులే లక్ష్యంగా ఏపీ భేటీలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా 940.87 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లతో పాటు టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన అనుమతుల పత్రాలు అందజేయాలని ఏపీ భేటీలో కోరనుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులనూ అడగనుంది. ఇక సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా కృష్ణా పరీవాహకంలో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు, వాటిని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలను అందజేయాలని సూచించే అవకాశాలున్నాయి.

Updated Date - Jan 29 , 2026 | 05:22 AM