తెలంగాణ యువకుడి ‘హర్ శిఖర్ పర్ తిరంగా’
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:16 AM
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎత్తయిన పర్వతాలపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పంతో బయలుదేరిన తెలంగాణ యువకుడు అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
నాగాలాండ్‌లో ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన భూక్యా యశ్వంత్
కోహిమా, సెప్టెంబరు 29: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎత్తయిన పర్వతాలపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పంతో బయలుదేరిన తెలంగాణ యువకుడు అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మహబూబాబాద్ జిల్లా భూక్యా తాండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాగాలాండ్‌లోనే అత్యంత ఎత్తయిన ‘సారామతి’ పర్వతాన్ని (3,841మీటర్లు) విజయవంతంగా అధిరోహించారు. సెప్టెంబర్ 20న ఈ పర్వత శిఖరాగ్రాన త్రివర్ణ పతాకం ఎగురవేసి.. ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాల (సెవెన్ సిస్టర్స్) అత్యున్నత పర్వతాలను అధిరోహించే ఘట్టాన్ని పూర్తి చేశారు. ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గోవా, నాగాలాండ్‌లతో కలిపి మొత్తం 11 రాష్ట్రాల ఎత్తయిన పర్వతాలను అధిరోహించాడు.
కేంద్రం పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ పర్ తిరంగా’ స్ఫూర్తితో ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ మిషన్‌ను ప్రారంభించినట్లు యశ్వంత్ తెలిపారు. పేరున్న పర్వతాలనే కాకుండా, దేశంలోని ప్రతి రాష్ట్ర భౌగోళిక విశిష్టత చాటిచెప్పేందుకు యాత్ర చేపట్టానన్నారు. లఢఖ్‌లో 6వేల మీటర్ల ఎత్తయిన శిఖరాన్ని ఎక్కి వచ్చినప్పటికీ, సారామతి పర్వత అధిరోహణ మరో రకమైన సవాలు విసిరిందని తెలిపారు. దట్టమైన అడవులు, నిటారైన కొండచరియల మధ్య మూడు రోజుల పాటు సాగిన యాత్రలో అసోం రైఫిల్స్ అధికారి సహా 10నుంచి 12మంది పాల్గొన్నారు. ప్రకృతి సహకరించడం వల్లే సకాలంలో చేరుకోగలిగామని, స్థానికులు ఎంతో ఆప్యాయంగాఆతిథ్యం ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా 17 రాష్ట్రాలు అధిరోహించాల్సి ఉందని, ఆర్థిక సవాళ్లను అధిగమించి రాబోయే ఏడాదిలో ఈ యాత్రను పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తదుపరి దఫాలో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎత్తయిన పర్వతాలపై జాతీయ జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెప్పారు.