చుక్క నీటినీ వదులుకోం
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:10 AM
కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
మేం వచ్చాకే కృష్ణా, గోదావరిలో నీటి హక్కుల కోసం పోరాడుతున్నాం
విందుల కోసం తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారు
పోలవరం-నల్లమల సాగర్‌ను అన్ని వేదికలపైనా వ్యతిరేకిస్తున్నాం: ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. విందుల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, కానీ.. పదేళ్లపాటు తెలంగాణను బీఆర్‌ఎస్ నిలువు దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. పదేళ్ల బడ్జెట్లలో మొత్తం రూ.17 లక్షల కోట్లు వెచ్చిస్తే.. అందులో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు వెచ్చించారని, కానీ.. రూ.లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారు అధికారంలో ఉండగానే కుప్పకూలిందని అన్నారు. ఆ ప్రాజెక్టులో లక్ష ఎకరాలు కూడా సాగులోకి రాలేదన్నారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని, బీఆర్‌ఎస్ చేసిన పొరపాట్లను సరిచేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీల నీటిని కేటాయిస్తే.. రాష్ట్రం ఏర్పడ్డాక అందులో 512 టీఎంసీలను ఏపీకి రాసిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలు చాలునంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంతకాలు చేయలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావే ఉన్నారని ఉత్తమ్ గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కావాలని కోరుతున్నామని, జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో పోరాడుతున్నామని తెలిపారు. ‘‘కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఏపీ సీఎం జగన్‌కు విందులు ఇచ్చి.. గోదావరి జలాలను తెలంగాణ నుంచి తీసుకెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటించలేదా? రోజా ఇంటికి వెళ్లి మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం మర్చిపోతుందనుకుంటున్నారా?’’ అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
నల్లమల సాగర్‌కు ఏ అనుమతులూ రాలేదు..
పోలవరం-నల్లమలసాగర్/బనకచర్లను అన్ని వేదికల్లోనూ వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘానికి, జలశక్తి శాఖకు, గోదావరి, కృష్ణా బోర్డులకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాశామని, కేంద్రంతో జరిగిన పలు సమావేశాల్లో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించామని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను సీజేఐ సూచనతో వెనక్కి తీసుకొని ఒరిజనల్ సూట్ వేస్తున్నామని అన్నారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్)పై రెండు రోజుల క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశామని, ఆ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదంటూ లేఖ ద్వారా ఆయన సమాచారం ఇచ్చారని తెలిపారు. డీపీఆర్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు పదే పదే అవాస్తవాలు, అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశం గురించి హరీశ్‌రావు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. పోలవరం-నల్లమలసాగర్‌ను అజెండాలో చేర్చడానికి వీల్లేదని సమావేశంలో అధికారులు చెప్పారని, అంతర్రాష్ట్ర వివాదాల వల్ల ఆగిన ప్రాజెక్టులపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్ర మే చెప్పామని మంత్రి స్పష్టం చేశారు.
కాళేశ్వరంపై సిగ్గుపడాల్సిందిపోయి..
వారి హయాంలోనే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలినందుకు సిగ్గుపడాల్సింది పోయి.. సమర్థించుకుంటారా? అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ఐదేళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 160 టీఎంసీల నీటిని ఎత్తిపోశారని, కానీ.. వరదలతో నీటిని కిందికి వదిలిన తర్వాత, జలాశయాల్లో నిల్వల తర్వాత 60-70 టీఎంసీలే వినియోగించారని తెలిపారు. 60-70 టీఎంసీల నీటితో 17 లక్షల ఎకరాల ఆయకట్టు ఎలా వచ్చిందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదుల, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రెండేళ్లలోనే కృష్ణా జలాల్లో ఎక్కువ వినియోగం జరిగిందని, ఎక్కువ పంట పండిందని, సేకరణ కూడా ఈ రెండేళ్లలోనే జరిగిందని తెలిపారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. నీటిపారుదల శాఖను బీఆర్‌ఎస్ దోపిడీ వ్యవస్థగా మార్చిందని ఉత్తమ్ ఆరోపించారు. పదేళ్లలో బదిలీలు, నియామకాలు కూడా జరగలేదని వెల్లడించారు. రెండేళ్లలో నియామకాలు చేశామని, శాశ్వత ప్రాతిపదికన పదోన్నతులు ఇచ్చామని చెప్పారు.
హరీశ్‌రావు సలహాలు అక్కర్లేదు..
నీటిపారుదల ప్రాజెక్టులపై హరీశ్‌రావు సలహాలు తమకు అవసరంలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. ‘‘ఇరిగేషన్ శాఖను నాశనం చేసిన మీరు మాకు సలహాలు ఇస్తారా?’’ అని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత ప్రమాదకర డ్యామ్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. బ్యూరోక్రాట్లపై తప్పుడు ఆరోపణలు చేయడం బీఆర్‌ఎస్ మానుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకున్నది, జీవోలు జారీ చే సింది ఆదిత్యనాథ్ దాస్ అని, ఆయనను తాము ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నామని తెలిపారు. కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఏపీ ప్రాజెక్టులపై పనిచేసిన ఎస్‌కే జోషిని సలహాదారుగా నియమించుకుందని అన్నారు.