Share News

వాహన రిజిస్ట్రేషన్‌కు..బ్యాంకు ఖాతా అనుసంధానం!

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:22 AM

షోరూమ్‌ల వద్దే నూతన వాహనాల రిజిస్ట్రేషన్లతో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిన అధికారులు.. అదే సమయంలో ఎన్నడూ లేని ఓ కొత్త నిబంధన పెట్టారు.

వాహన రిజిస్ట్రేషన్‌కు..బ్యాంకు ఖాతా అనుసంధానం!

  • ఆ వివరాలు నమోదు చేస్తేనే రిజిస్ట్రేషన్‌ పత్రాల అప్‌లోడింగ్‌

  • పలు వాహన షోరూమ్‌ల వద్ద బోర్డులు

  • ట్రాఫిక్‌ చలానాల ఆటోడెబిట్‌ కోసమేననే చర్చ

  • బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటున్నది చిరునామా కోసమే అంటున్న అధికారులు

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): షోరూమ్‌ల వద్దే నూతన వాహనాల రిజిస్ట్రేషన్లతో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిన అధికారులు.. అదే సమయంలో ఎన్నడూ లేని ఓ కొత్త నిబంధన పెట్టారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం యజమాని బ్యాంకు ఖాతా నంబరు, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ వివరాలను కూడా తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఈ వివరాలను నమోదు చేయకపోతే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు అప్‌లోడ్‌ కావడం లేదు. రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన పత్రాల జాబితాలో బ్యాంకు ఖాతా వివరాలు కూడా కావాలంటూ షోరూముల నిర్వాహకులు బోర్డులు పెడుతున్నారు. ఇది చలానాల ఆటోడెబిట్‌ కోసమే కావొచ్చని, కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. దీనితో ట్రాఫిక్‌ జరిమానాలను ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి వసూలు (ఆటో డెబిట్‌) చేసుకోవడానికే బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారనే చర్చ మొదలైంది. వాహనాల అతివేగం, రాంగ్‌రూట్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణం తదితర నిబంధనల ఉల్లంఘనలకు విధించే జరిమానాలను నేరుగా బ్యాంకు ఖాతా నుంచి కట్‌ చేసుకునే విధానం ఉండాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న నేపథ్యంలో.. బ్యాంకు ఖాతా వివరాల సేకరణ అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కానీ రిజిస్ట్రేషన్‌ సమయంలో బ్యాంకు ఖాతా వివరాలు కేవలం చిరునామా ప్రూఫ్‌ కోసమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. రవాణాశాఖ వద్ద, ఆర్సీ కార్డులపై యజమానుల పాత అడ్ర్‌సలే ఉంటున్నాయని.. వారు ఇళ్లు మారినప్పుడు కొత్త చిరునామాను నమోదు చేసుకోవడం లేదని అంటున్నాయి. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర అవసరమైన సందర్భాల్లో వాహనాల యజమానులను గుర్తించడం, సంప్రదించడంలో సమస్యలు వస్తున్నాయని.. అందుకే బ్యాంకు ఖాతా వివరాల సేకరణ చేపట్టారని పేర్కొంటున్నాయి.

Updated Date - Jan 31 , 2026 | 04:22 AM