పట్టణ ప్రగతికి కేంద్రం తోడ్పాటు అవసరం
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:49 AM
తెలంగాణలో పట్టణ ప్రగతికి కేంద్రం తోడ్పాటు అవసరమని, అమృత్, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, మెట్రో రవాణా, తాగునీటి భద్రత, పారిశుధ్యం, పట్టణ రవాణా పునర్ వ్యవస్థీకరణకు కేంద్రం...
భూ వినియోగ సంస్కరణలతోనే మంచి ఫలితాలు: ఆర్థిక సర్వే సూచన
హైదరాబాద్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పట్టణ ప్రగతికి కేంద్రం తోడ్పాటు అవసరమని, అమృత్, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, మెట్రో రవాణా, తాగునీటి భద్రత, పారిశుధ్యం, పట్టణ రవాణా పునర్ వ్యవస్థీకరణకు కేంద్రం నిధులు ఇస్తేనే రాష్ట్రం ఊపిరి పీల్చుకుంటుందని 2025-26 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అమృత్ 2.0 కింద పట్టణ తాగునీటి వ్యవస్థను మరింత శాస్త్రీయంగా నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోందని పేర్కొంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి అమృత్ నగరాలకు ఇది కీలకంగా మారనుంది. కాగా, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ‘గార్బేజ్ ఫ్రీ సిటీ’ రేటింగ్‌లో పట్టణాలకు పోటీ పెట్టగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కూడా ఈ ప్రమాణాల్లో పోటీపడుతున్నాయని సర్వే పేర్కొంది. నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థ రాకపోకలకు అనువుగా ఉన్నా భూమి వినియోగంలో సంస్కరణలు అమలు చేయకుండా భారీ నిర్మాణాలు చేపడితే ఆశించిన ఫలితాలు దక్కవని సర్వే హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ టీడీఆర్ బాండ్లతో పట్టణ ఆర్థిక ప్రగతిలో రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపింది. బాండ్ల ద్వారా నిధులు సమీకరించి జీహెచ్‌ఎంసీ దేశంలో అగ్రభాగాన నిలిచిందని, ఇది మిగిలిన నగరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపింది.