పట్టణ ప్రగతికి నిధుల వరద
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:20 AM
పట్టణ సంస్థలకు 16వ ఆర్థిక సంఘం భారీ స్థాయిలో సిఫారసు చేసింది. విధానపరమైన ఈ నిర్ణయం వల్ల పట్టణాలకు అదనపు నిధులు అందనున్నాయి.
వచ్చే ఐదేళ్ల కోసం రూ.3.55 లక్షల కోట్ల అదనపు కేటాయింపులు
15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రూ.3682 కోట్లు
16వ ఆర్థిక సంఘం ద్వారా రానున్న రూ.11,548 కోట్లు
214 శాతం అదనం.. మౌలిక వసతుల కల్పనకు ఊతం
హైదరాబాద్, ఫిబ్రవరి 3(ఆంధ్ర జ్యోతి): పట్టణ సంస్థలకు 16వ ఆర్థిక సంఘం భారీ స్థాయిలో సిఫారసు చేసింది. విధానపరమైన ఈ నిర్ణయం వల్ల పట్టణాలకు అదనపు నిధులు అందనున్నాయి. మౌలిక వసతుల కల్పన మరింత మెరు గ్గా చేపట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. దేశంలో పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు భారీగా నిధులు కేటాయించేలా 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీనిద్వారా పట్టణాలకు రూ.7,91,393 లక్షల కోట్లు కేటాయించనున్నారు. వచ్చే ఐదేళ్ల కోసం.. అంటే 2026-31 కాలానికి ఈ నిధులు కేటాయించాలని ఆర్థిక సంఘం సూచించింది. 15వ ఆర్థిక సంఘం(2021-26) సిపారసులతో పోల్చితే ఇది రూ.3.55 లక్షల కోట్ల మేర పెరుగుదల. కాగా ఇప్పటి వరకు స్థానిక సంస్థల గ్రాంట్లలో పట్టణాలతో పోల్చితే సింహభాగం గ్రామపంచాయతీలకే కేటాయింపులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పట్టణీకరణ ప్రగతికి ప్రాధాన్యం పెరిగింది.
రాష్ట్రానికి భారీగా పెరిగిన నిధులు
రాష్ట్రాల వారీగా పట్టణ స్థానిక సంస్థలకు 16వ ఆర్థిక సంఘం నిధుల పెరుగుదలను పరిశీలిస్తే తెలంగాణకు 214 శాతం పెరుగుదల ఉంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.3682 కోట్లు కేటాయింపులు ఉండగా, 16వ ఆర్థిక సంఘంలో ఈ మొత్తం రూ.11548 కోట్లకు చేరింది. ఇది తెలంగాణ పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు, పౌరసేవల్లో మెరుగైన పాలన అందించేందుకు దోహదపడుతుందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. 16వ ఆర్థిక సంఘం కేటాయింపుల్లో 65 శాతం బేసిక్ గ్రాంట్లు.. 16 శాతం పనితీరు ఆధారిత గ్రాంట్లు, 16 శాతం ప్రత్యేక మౌలిక సదుపాయాల నిధుల, 3 శాతం పట్టణీకరణ ప్రీమియం గ్రాంటుగా ఇవ్వనున్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా అందే నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణ, చెత్తసేకరణ, రీసైక్లింగ్, నగర రహదారులు, డ్రైనేజీ, స్మార్ట్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేయాలి. హైదరాబాద్‌తోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిధులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకం కానున్నాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిధులు అదనపు బలం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో చిన్న పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రణాళికలతో ఈ నిధులు సద్వినియోగం చేసుకోగలిగితే పట్టణాభివృద్ధి వేగంగా జరిగి.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని పురపాలక శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.