కేజీబీవీ విద్యార్థినుల సంఖ్యలో తెలంగాణ టాప్
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:41 AM
రెండు తెలుగు రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ మంది విద్యనభ్యసిస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది.
లోక్‌సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ మంది విద్యనభ్యసిస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణలోని 721 కేజీబీవీల్లో అత్యధికంగా 1,41,771 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారని మంత్రి వివరించారు. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన కొనియాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ 1,03,733 మంది విద్యార్థినులతో రెండో స్థానంలో నిలిచిందని, ఏపీలో మొత్తం 546 కేజీబీవీలు సేవలందిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 5,316 కేజీబీవీలు ఉండగా, వాటిలో సుమారు 7.58 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారని మంతిర ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.