మదన్‌పల్లి తండా, నర్కూడ అమ్మపల్లిలో..728 ఎకరాలను స్వాధీనం చేసుకుంటాం
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:09 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి తండాలోని ప్రభుత్వ భూములను త్వరలోనే ల్యాండ్ పూలింగ్ విధానంలో స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ రవీందర్ దత్ తెలిపారు.
ఆ అసైన్డ్ భూముల విలువ రూ.4,368 కోట్లు
శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి తండాలోని ప్రభుత్వ భూములను త్వరలోనే ల్యాండ్ పూలింగ్ విధానంలో స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ రవీందర్ దత్ తెలిపారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములను కొందరు అక్రమార్కులు నోటరీ ద్వారా కొనుగోలు, అమ్మకాలు జరుపుతున్నారని, త్వరలోనే వాటిని స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం రేడియల్ రోడ్డు సర్వే పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయిన తర్వాత మదన్‌పల్లి తండా ప్రభుత్వ భూముల విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్వే నంబరు 50లో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని వాటిని త్వరలోనే గుర్తించి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కాగా, శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ అమ్మపల్లి సర్వే నంబరు 19లో 250 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అందులో 80 ఎకరాలను గతంలో ప్రభుత్వం ఒయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు కేటాయించింది. 178 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది. ఇందులో చాలా వరకు స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించారు. ఆ వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. వాటిని కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. రెండు గ్రామాల్లో దాదాపు 728 ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటామని అధికారులు వెల్లడించారు. మొత్తం భూముల విలువ దాదాపు రూ.4,368 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.