8 నుంచి మహిళలకు స్ర్కీనింగ్ పరీక్షలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:11 AM
రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీన ప్రారంభించాలని మంత్రి దామోదర...
స్వయం సహాయక సంఘాల్లోని 46లక్షల మందిమహిళల హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించాలి: మంత్రి దామోదర
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీన ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 99 రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులు రూపొందించిన ప్రణాళికను స్వల్ప మార్పులతో మంత్రి ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8 నుంచి మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు పరీక్షలు చేయాలని ఆదేశించారు. తొలిదశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్ర్కీనింగ్ చేపట్టాలని సూచించారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సహకారంతో ఒక్కో మహిళకు మొత్తం 30 రకాల పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం స్ర్కీనింగ్ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 4 దశల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.