అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:32 AM
అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించింది.
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించింది. అసెంబ్లీలోని మండలి భవనం పక్కన ఉన్న గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల వరుసలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. గాంధీ విగ్రహానికి ఎడమవైపు 8 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహం ఉండగా, అంతే ఎత్తుతో గాంధీ విగ్రహానికి కుడివైపున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పా టు చేయనున్నారు. ఇందుకోసం అక్కడ కాంక్రీట్ బేస్‌మెంట్‌ను నిర్మించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 16న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహం ఖర్చు రూ.34 లక్షలు, ఫౌండేషన్, ఇతర సివిల్ పనులకు మరో రూ.12 లక్షలు కలిపి రూ.46 లక్షలను వెచ్చిస్తున్నారు. అలాగే పునరుద్ధరించిన శాసనమండలి భవనంలోనే ఈసారి మండలి సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు మండ లి భవనం పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 8న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా మండలి భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలి భవనం పునరుద్ధరణ కోసం ప్రభుత్వం దాదాపు రూ.20 కోట్లను వెచ్చించింది. ఆగాఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవనం పునరుద్ధరణ పనులను చేపట్టగా, గతంలో ఉన్న మాదిరిగానే భవనం ఆకృతి దెబ్బతినకుండా ఆధునీకరించారు.