Share News

రిజిస్ర్టేషన్‌ శాఖకు కలిసొచ్చింది!

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:20 AM

గత ఏడాదితో పోలిస్తే తొలి పది నెలల వ్యవధిలో రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు పుంజుకోవడం, పట్టణ ప్రాంతాల్లో క్రయ విక్రయాలు పెరగడం, డిజిటల్‌....

రిజిస్ర్టేషన్‌ శాఖకు కలిసొచ్చింది!

  • పది నెలల్లో 10,951 కోట్ల ఆదాయం

  • గత ఏడాదితో పోలిస్తే 596కోట్లు అదనం

  • పట్టణాల్లో క్రయ విక్రయాలు పెరగడమే కారణం

  • ‘కోర్‌ అర్బన్‌’లో భూముల విలువలపై మళ్లీ అధ్యయనం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్ర జ్యోతి): గత ఏడాదితో పోలిస్తే తొలి పది నెలల వ్యవధిలో రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు పుంజుకోవడం, పట్టణ ప్రాంతాల్లో క్రయ విక్రయాలు పెరగడం, డిజిటల్‌ సేవల విస్తరణ వంటి అంశాలు రిజిస్ర్టేషన్‌ శాఖకు కలిసొచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 జనవరి వరకు రూ.10951.30 కోట్ల ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి వచ్చిన ఆదాయం రూ.10,354.85 కోట్లు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రూ.596.45 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి 14,41,466 దస్తావేజుల రిజిస్ర్టేషన్‌ జరగ్గా.. ఈ ఏడాది 14,05,723 దరస్తావేజులు రిజిస్ర్టేషన్‌ అయ్యాయి. ఆదాయ వృద్ధిలో జనవరి నెల కీలకంగా మారింది. ఈ నెలలోనే ఏకంగా రూ.1046.29 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం (జనవరి2025) ఇది రూ.861.86 కోట్లు. ఈ ఒక్క నెలలోనే రూ.184 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం పెరగడంలో వ్యసాయేతర భూముల లావాదేవీలు కీలక పాత్ర పోషించాయి. 2024 ఏప్రిల్‌ నుంచి 2025 జనవరి వరకు వ్యవసాయేతర క్రయవిక్రయాలు 9,36,479 జరగ్గా.. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 జనవరి వరకు 9,46,751 దస్తావేజులు రిజిస్టర్‌ అయ్యాయి. ఆదాయ పరంగా చూస్తే గత ఏడాది పది నెలల్లో రూ.9050.19 కోట్లు రాగా, ఈ ఏడాది రూ. 9,763.13 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే రూ.712.94 కోట్ల ఆదాయం పెరిగింది. ఇదే సమయంలో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది 4,60,835 క్రయవిక్రయాలకు గాను రూ.1188.17కోట్లు వస్తే.. గత ఏడాది 5,09,750 దస్తావేజులకుగాను రూ.1278.36 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.90.19 కోట్ల మేర ఆదాయం తగ్గింది.

సర్కిళ్ల వారీగా భూముల విలువల సవరణ

రాష్ట్రంలో ఇప్పటికే పలు దఫాలుగా భూముల విలువలను సవరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా కోర్‌ అర్బన్‌ ప్రాంతాన్ని ప్రభుత్వం 300 డివిజన్లు, 60 సర్కిళ్లు.. 12 జోన్లుగా విభజించింది. ఈ నేపథ్యంలో సర్కిళ్ల వారీగా భూముల విలువలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఆయా సర్కిళ్ల పరిధిలోని పరిస్థితులపై అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫ్యూచర్‌ సిటీని పరిగణలోకి తీసుకుని.. ఓఆర్‌ఆర్‌ లోపల.. ఓఆర్‌ఆర్‌ బయట.. కీలక ప్రాంతాలపై మరోసారి అధ్యయనం చేసి.. భూముల విలువల పెంపుపై ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్‌ శాఖ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 03 , 2026 | 03:20 AM