Share News

రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక సంస్కరణలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్ది ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక సంస్కరణలు

పటాన్‌చెరు రూరల్‌/హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్ది ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్ధనూర్‌లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సముదాయానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా సమీకృత కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కర్ధనూర్‌లో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో 20 వేల చదరపు అడుగుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ భూమికి భూధార్‌ మ్యాప్‌ను ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. భూ భారతి ద్వారా డబుల్‌ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం 5,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించామని, ఆధునిక పరికరాలతో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ తెచ్చిన చిక్కుముడులను భూభారతి చట్టం విప్పుతుందని మంత్రి వివేక్‌ పేర్కొన్నారు.

విపత్తు నిర్వహణ పరికరాల కొనుగోలు

రాష్ట్రంలోని విపత్తుల నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలో బుధవారం విపత్తుల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా రూ.100కోట్లతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసేలా 70, 80 కిలోల బరువు ఎత్తే డ్రోన్లు కొనుగోలు చేయాలని సూచించారు.

Updated Date - Jan 29 , 2026 | 05:23 AM