అజెండాలో నల్లమలసాగర్ వద్దు
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:18 AM
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో సమావేశం జరిగింది.
సీడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ ప్రతిపాదన
7 రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వండి
15 రోజుల్లో అభిప్రాయాలు చెప్పండి
ఏపీ, తెలంగాణకు సీడబ్ల్యూసీ సూచన
న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యంతరాలు, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, పలు ప్రాజక్టులకు కేంద్ర అనుమతులపై ఏయే అంశాలు ప్రతిపాదనల్లో పొందుపరుస్తారనే అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి త్వరలో జరగబోయే కీలక సమావేశంలో చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేసేందుకుగాను సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇది దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ అధికారులు ఎవరి వాదనలు వారు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించ తలపెట్టిన పోలవరం- బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని తెలంగాణ ప్రతిపాదించింది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సెక్రటరీ కో ఆర్డినేషన్ గౌరవ్ ఉప్పల్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్‌సీ మహ్మద్ అమ్జాద్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్ తరఫున సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, సీఈ సుగుణాకర్‌రావు, ఎస్‌ఈ గిరిధర్‌రావు హాజరయ్యారు. సమావేశం అనంతరం రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. ‘‘అజెండాలోని అంశాలను ఖరారు చేసేందుకే తొలి సమావేశం జరిగింది. కేవలం గోదావరి, కృష్ణా జల వివాదాలకు సంబంధించి అంతర్రాష్ట్ర అంశాలపైనే ఇది ఏర్పాటైంది. తెలంగాణ నుంచి అభ్యంతరాలు, సమస్యలను సీడబ్ల్యూసీకి అందించాం. ఆంధ్రప్రదేశ్ ఏమీ చెప్పలేదు. ఇది తొలి సమావేశం మాత్రమే. తర్వాత జరిగే భేటీలో ఒక్కో అంశంపై కూలంకషంగా చర్చిస్తాం. గోదావరి, కృష్ణా నదీ జలాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పోలవరం-నల్లమల్లసాగర్ సమస్యలను అంజెండాలో చేర్చవద్దని చెప్పాం. అంతర్రాష్ట్ర సమస్యల వల్లే కమిటీ వేశారు. తెలంగాణ నుంచి 12 అంశాలు ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలు వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని సీడబ్ల్యూసీ సూచించింది. 15 రోజుల్లో ఆ ప్రతిపాదనలపై ఇరు రాష్ట్రాలూ అభిప్రాయాలు చెప్పాలని తెలిపింది. తదుపరి సమావేశం ఎప్పుడు ఉంటుందనేది సీడబ్ల్యూసీ చైర్మన్ నిర్ణయిస్తారు. నెల రోజుల్లో మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉంది’’ అని రాహుల్ బొజ్జా తెలిపారు.
ఆ నీటిని వాడుకుంటే తప్పేంటి..?:ఏపీ
ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అజెండాను పీపీటీ రూపంలో కేంద్ర జలసంఘం అధికారులు వివరించారు. ‘‘పోలవరం-బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఎగువ రాష్ట్రాలు వారి హక్కుల ప్రకారం వినియోగించుకున్న తర్వాతే పోలవరం నుంచి సముద్రంలో వృథాగా కలిసే మిగులు జలాలతోనే ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించామని తెలిపాం. వృథా జలాలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటే తప్పేంటని తెలంగాణ ప్రతినిధులను సీడబ్ల్యూసీ చైర్మన్ ప్రశ్నించారు. ఏపీ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు లేని వివాదం, ఇప్పుడు బనకచర్ల విషయంలో ఎందుకని మేం ప్రశ్నించాం. 66:34 నిష్పత్తికి బదులుగా 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాలను ఈ ఏడాది నుంచే పంచాలని తెలంగాణ కోరింది. అది సాధ్యం కాదని మేం తేల్చి చెప్పాం. వారం రోజులు గడువిస్తే తమ అజెండాను నివేదిస్తామని తెలంగాణ సీడబ్ల్యూసీని కోరింది’’ అని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సలహాదారు వెంకటేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ ప్రతిపాదనలు ఇలా..
కృష్ణాలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 299 టీఎంసీలతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 188 టీఎంసీలు, పోలవరం వాటా కింద దక్కిన 45 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని సమావేశంలో తెలంగాణ కోరింది. కృష్ణాలో 532 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో పంచాలి. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ఇతర బేసిన్‌లకు తరలించకుండా ఏపీని కట్టడి చేయాలి.
కృష్ణా జలాల లెక్కలు పక్కాగా తీయడానికి వీలుగా టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలి.
నాగార్జునసాగర్ డ్యామ్‌ను పూర్తిగా తెలంగాణకు అప్పగించాలి.
బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటి వినియోగానికి తరలించే జలాల్లో 80 శాతం రిటర్న్‌ఫ్లో కింద మళ్లీ బేసిన్‌లో కలుస్తున్నందున 100 టీఎంసీలు తరలిస్తే.. 20 టీఎంసీలు మాత్రమే తరలించినట్లు లెక్కలోకి తీసుకోవాలి.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎ్‌స)ను ఆధునికీకరించాలి. తుంగభద్ర బోర్డుతో ముడిపడి ఉన్న సమస్యలపై చర్చించాలి.
శ్రీశైలంతో పాటు పలు ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్తు సమస్యలను పరిష్కరించాలి.
ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి, 200 టీఎంసీల వరద జలాలను తరలించడానికి తెలంగాణకు అవకాశం ఇవ్వాలి.
పోలవరం ముంపు సమస్యను పరిష్కరించాలి.