పుర పోరులో తొలిరోజు 902 నామినేషన్లు
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:24 AM
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి తొలిరోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో మొత్తం 2996 వార్డుల్లో 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు దాఖలు చేశారు.
రేపటితో నామినేషన్ల స్వీకరణ పూర్తి
హైదరాబాద్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి తొలిరోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో మొత్తం 2996 వార్డుల్లో 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల గుర్తుతో జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 382, బీఆర్‌ఎస్ నుంచి 258, బీజేపీ తరపున 169 దాఖలయ్యాయి. ఇతర గుర్తింపు పొందిన పార్టీల తరఫున 19, సీపీఎం 8, బీఎస్పీ 7, ఎంఐఎం 3, ఆప్ తరపున 1 నామినేషన్ దాఖలయ్యాయి. 55 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వార్డుల వారీగా అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగియనుంది. మరోవైపు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) మార్గదర్శకాలను జారీచేసింది. వార్డు మెంబర్లుగా పోటీచేేస అభ్యర్థుల ఖర్చుపై ఎస్‌ఈసీ నిర్ణయించిన ప్రకారం మున్సిపాలిటీల్లో గరిష్టంగా రూ.1,00,000 వరకు, కార్పొరేషన్లలో రూ.1,50,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి సంబంధిత మున్సిపాలిటీ/కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలని, ప్రతిపాదించే వ్యక్తి ఆ వార్డు ఓటరై ఉండాలన్నారు. సందేహాల నివృత్తి కోసం అన్ని మునిసిపల్, కార్పొరేషన్ కార్యాలయాల్లో హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది.