బాబ్బాబూ ఉపసంహరించుకోవూ!
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:03 AM
మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఇప్పటి దాకా ప్రధాన పార్టీలు అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వలేదు. పార్టీ అధ్యక్షులు..
రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు.. ఉపసంహరింపజేశాకే బీ ఫారాల పంపిణీ
నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు 3 దాకా గడువు
తిరుగుబాటు అభ్యర్థుల బెడద అధికార కాంగ్రె్‌సలోనే ఎక్కువ
హైదరాబాద్, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఇప్పటి దాకా ప్రధాన పార్టీలు అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వలేదు. పార్టీ అధ్యక్షులు.. బీ ఫారం, ఏ ఫారంలపై సంతకాలు చేసి క్షేత్రస్థాయిలో బాధ్యులకు పంపారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం 3వ తేదీ వరకు గుడువు ఉండటంతో ఆయా పార్టీల నాయకత్వం తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడింది. రెబెల్స్ చేత నామినేషన్లు ఉపసంహరింపజేశాక ముందే నిర్ణయించిన అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ తిరుగుబాట్ల బెడద ఎక్కువగా ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థిత్వాలకు సంబంధించి మొదటి నుంచీ కాంగ్రె్‌సలో ఉన్న నేతలకు, అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రె్‌సలో చేరిన నాయకులకు మధ్య పోటీ నడుస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగానూ తిరుగుబాటు అభ్యర్థుల బెడదను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. మునిసిపల్ ఎన్నికల్లో ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించి.. పరిష్కార బాధ్యతలూ వారికి అప్పగించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్లు అభ్యర్థుల ఎంపిక బాధ్యతనూ ఇన్‌చార్జి మంత్రులపైనే పెట్టారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొద్ది రోజులుగా మంత్రులు.. ఆయా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసేటప్పటికి సాధ్యమైనంతవరకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా పరిష్కరించారు. అయినా అనేక చోట్ల ఒక డివిజన్/వార్డుకు ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ నేతలు నామినేషన్లు దాఖలు చేసినట్లు చెబుతున్నారు. స్ర్కీనింగ్ కమిటీల సభ్యులు ఆయా నాయకులతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం.. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను పూర్తిగా స్థానిక నాయకత్వానికి అప్పగించేసింది. ప్రతి మునిసిపాలిటీ/కార్పొరేషన్‌కు ఒక ఇన్‌చార్జిని నియమించింది. ప్రస్తుతం ఈ ఇన్‌చార్జిలు.. తిరుగుబాటు అభ్యర్థులు ఉన్న చోట్ల బుజ్జగింపు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.