మునిసిపల్ బరిలో 12,993 మంది అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:31 AM
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో....
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మునిసిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో 2,996 వార్డులకు గాను గత నెల 30న నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో పోటీ కోసం 20,313 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ లు మంగళవారం పూర్తయిన అనంతరం 12,993మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, నామినేషన్ల తిరస్క రణ, ఉపసంహరణ ప్రక్రియలో 7,320మంది పోటీ నుంచి తొలగిపోయారు.
ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి
అధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు
మున్సిపల్ ఎన్నికలను చట్టం ప్రకారం సమర్ధవంతంగా నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల క్రమంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ)లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ మాట్లాడారు.పోలీసు అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఏ చిన్న ఉల్లంఘనను ఉపేక్షించవద్దని సూచించారు. ఎన్నికల ప్రక్రియ, ప్రచారంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలపై పోలీసు లీగల్ అడ్వయిజర్ శ్రీరాములు పోలీసు అధికారులకు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయడం, ఒకరికే ఓటు వేయాలని ఒత్తిడి తీసుకుని రావడం, లేదా నామినేషన్లు అడ్డుకోవడం, ప్రచారానికి అడ్డంకులు కల్పించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.