21, 22 తేదీల్లో సాహితీ దశాబ్ది ఉత్సవాలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:37 AM
తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి తెలిపారు. ఏవీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. రాజలింగం, పత్రికా సంపాదకులు ఆర్. రమేశ్‌లతో కలిసి దశాబ్ది ఉత్సవాల పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ.. తెలంగాణ సాహితీ పదేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు ఐదు సాహిత్య మహోత్సవాలు నిర్వహించగా, ఆరో సాహిత్య మహోత్సవాన్ని దశాబ్ది ఉత్సవాలుగా ఏవీ కళాశాల తెలుగు శాఖతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అనే అంశంపై కవితలు, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. రాజలింగం మాట్లాడుతూ.. సాహిత్య మహోత్సవంలో తమ కళాశాల భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.