శాసనమండలి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ఆవరణలోని భవనంలోనే: గుత్తా
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:12 AM
వచ్చే శాసనమండలి బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీ ఆవరణలో ఉన్న భవనంలోనే నిర్వహించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వచ్చే శాసనమండలి బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీ ఆవరణలో ఉన్న భవనంలోనే నిర్వహించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలోని మండలి హాల్ నిర్మాణ పనుల గురించి ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో మండలి హాల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, త్వరిత గతిన పూర్తి చేసి అధికారులకు అప్పగించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సుఖేందర్‌రెడ్డి సూచించారు. లేనిపక్షంలో కంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఆవరణలోని భవనంలో శాసనమండలి హాల్ నిర్మాణ పనులను మంగళవారం సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం పనులపై అధికారులతో కలిసి సమీక్ష జరిపారు.