డ్వాక్రా మహిళలకు ఆరోగ్య పరీక్షలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:53 AM
రాష్ట్ర వ్యాప్తంగా 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు.
46లక్షల మందికి ఉచితంగా 30 పరీక్షలు
మహిళలతోనే సమాజ అభివృద్ధి: దామోదర
మంత్రి సీతక్కతో కలిసి డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ ప్రారంభం
నేటి నుంచి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. సెర్ఫ్ సహకారంతో మహిళలకు సమీప పీహెచ్‌సీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి 30 రకాల కీలక పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ఆ తర్వాత ప్రతి మహిళకు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ రికార్డును సృష్టించి, ఈహెచ్‌ఎమ్‌ఐ్‌స పోర్టల్‌లో భద్రపరుస్తారన్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారి ఆరోగ్య సమస్యలను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చునన్నారు. బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్కతో కలిసి దామోదర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డయాగ్నస్టిక్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఫీడింగ్ కియోస్క్ స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. తెలంగాణలో ఏటా సుమారు 3,200 సర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. దీని నివారణకు 14 ఏళ్లు దాటిన సుమారు 4లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీ టీకా వేస్తున్నట్లు తెలిపారు. బయట మార్కెట్లో రూ.3 వేల నుంచి రూ.4 వేల విలువ చేసే గార్డాసిల్-4 టీకాను కేంద్ర సహకారంతో ఉచితంగా అందిస్తున్నట్లు దామోదర ప్రకటించారు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత, వసతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను, సెర్ఫ్ విజయాల బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులను మంత్రులు సన్మానించారు.