Share News

భూసేకరణకు రూ.5 వేల కోట్లు!

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:57 AM

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. రానున్న బడ్జెట్‌లో ఈ నిధుల కేటాయింపునకు సూత్రప్రాయంగా అంగీకరించింది.

భూసేకరణకు రూ.5 వేల కోట్లు!

  • బడ్జెట్‌లో కేటాయించేందుకు సర్కారు సిద్ధం.. భూములు సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న సీఎం

  • ఆయన ఆదేశాలతోనే నిధుల కేటాయింపు

  • 37 వేల ఎకరాలు సేకరిస్తే 15 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. రానున్న బడ్జెట్‌లో ఈ నిధుల కేటాయింపునకు సూత్రప్రాయంగా అంగీకరించింది. 37 వేల ఎకరాలను సేకరిస్తే.. 15 లక్షల ఎకరాల దాకా సాగులోకి వస్తుందని సర్కారు గుర్తించింది. ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయాలు పెరగడానికి భూములు సేకరించక పోవడమే కారణమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించారు. దీంతో ఇక ఏ ప్రాజెక్టును ప్రతిపాదించినా.. తొలుత భూములు సేకరించాల్సిందేనని అధికారులకు నిర్దేశించారు. ఇదే సూత్రాన్ని ‘మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌’ ఎత్తిపోతల పథకంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా పదేళ్లపాటు పక్కనపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 టీఎంసీలతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో చేపడుతుండగా.. 562 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికే 195 ఎకరాలను సేకరించారు. ఇక 10 చెరువుల కింద లక్ష ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించగా..డిస్ట్రిబ్యూటరీల కోసం 1500 ఎకరాలు అవసరమని గుర్తించారు. తొలుత ప్రధాన ప్రాజెక్టును చేపట్టి, రెండో దశలో డిస్ట్రిబ్యూటరీ పనుల్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించింది. కన్నెపల్లి వద్ద ప్రాణహితపై చిన్నకాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టగా దానికి అన్నిరకాల అనుమతులూ వచ్చినా పదేళ్లుగా భూసేకరణ పూర్తికాకపోవడంతో నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరిగింది. ఈ ప్రాజెక్టుకు సవరణ నిర్మాణ అంచనా వ్యయంపై మంత్రివర్గం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. సీఎం ఆదేశాలతో చిన్నకాళేశ్వరంలో రూ.189 కోట్లను భూసేకరణ కోసం వెంటనే విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. భూముల విలువలు పెరిగిపోవడం, గత ప్రభుత్వమే 2దఫాలుగా భూముల మార్కెట్‌ విలువలు సవరించడం, రాష్ట్రంలో ఎక్కడైనా ఎకరం రూ.15 లక్షలకు తగ్గకుండా అమ్ముడుపోతుండడంతో తక్కువ ధరకు భూములివ్వడానికి రైతులు ముందుకు రావడం లేదు.


హెడ్‌ రెగ్యులేటరీలు పూర్తి చేసి..

కాళేశ్వరం ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీలు కట్టినంత వేగంగా గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీలపై దృష్టి పెట్టలేదు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌లో మాత్రమే డిస్ట్రిబ్యూటరీల పనులు జరిగాయి. ఈ జిలా ్లలో మాత్రమే 98 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.98 వేల కోట్లకు పైగా వెచ్చించగా ఆయకట్టు మాత్రం 98 వేల ఎకరాలే. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు పూర్తికావాలంటే 37 వేల ఎకరాల భూమి అవసరమని తాజాగా అంచనా వేశారు. రూ.5 వేల కోట్లు అవసరమని లెక్కకట్టారు.

ప్రధాన ప్రాజెక్టుల భూసేకరణ గమనిస్తే..

  • కల్వకుర్తి ఎత్తిపోతల కింద 22 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా 19432 ఎకరాలు సేకరించారు. 4.51 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా 2003లో రూ.1500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టగా ప్రస్తుతం నిర్మాణ అంచనా వ్యయం రూ.6 వేల కోట్లు దాటింది. 2655 ఎకరాలు సేకరిస్తే మరో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఆరు జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు 27047 ఎకరాలకు గాను 26 వేల ఎకరాలను సేకరించారు.

  • భద్రాద్రి జిల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు 411 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూములివ్వడానికి రైతులు ముందుకు రాకపోవడంతో సేకరణ నిలిచిపోయింది.

  • దేవాదుల ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. 30 వేల ఎకరా లు సేకరించారు. మరో 2786 ఎకరాలు సేకరించాలి. డిండి ఎత్తిపోతల పథకంలో లింక్‌ పనులకు 760 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

Updated Date - Jan 31 , 2026 | 03:57 AM