మాకొద్దీ ఫర్నీచర్!
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:08 AM
ప్రభుత్వ బోధనాస్పత్రులు, వైద్య కళాశాలలకు సరఫరా చేస్తున్న ఫర్నీచర్, బెడ్‌లు, ఇతర వస్తువుల్లో నాణ్యత ఉండటం లేదని, లెక్కల ప్రకారం వాటిని సరఫరా చేయడం లేదని...
సర్కారీ ఆస్పత్రులకు నాసిరకం ఫర్నీచర్ సరఫరా
బోధనాస్పత్రుల బాధ్యులు, ప్రిన్సిపల్స్ ఫిర్యాదు
వెనక్కు తీసుకోవాలని సూచన
అయినా 15 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన కార్పొరేషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ బోధనాస్పత్రులు, వైద్య కళాశాలలకు సరఫరా చేస్తున్న ఫర్నీచర్, బెడ్‌లు, ఇతర వస్తువుల్లో నాణ్యత ఉండటం లేదని, లెక్కల ప్రకారం వాటిని సరఫరా చేయడం లేదని, వెనక్కు తీసుకోవాలని ఇటీవల కొంతమంది ఆస్పత్రుల సూపరింటెండెంట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నాసిరకం ఫర్నీచర్ సరఫరాపై థర్డ్‌పార్టీ తనిఖీలకు ఆదేశించాలని కోరినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎ్‌సఐడీసీ) సరఫరా చేసిన ఈ ఫర్నీచర్‌పై పెద్దయెత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సరఫరా చేసిన ఫర్నీచర్‌పై అప్పటి వైద్యవిద్య సంచాలకులుగా పనిచేసినడాక్టర్ రమేశ్‌రెడ్డి, అలాగే డాక్టర్ వాణి కార్పొరేషన్ ఎండీకే నేరుగా ఫిర్యాదు చేశారు. అలాగే అప్పటి వైద్య మంత్రి హరీశ్‌రావు, ఇతర ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో నాసిరకం ఫర్నీచర్ సరఫరాకు పుల్‌స్టాప్ పడింది. మళ్లీ రెండేళ్లుగా అదే తంతు నడుస్తోంది. దీంతో పలువురు కాలేజీల ప్రిన్సిపల్స్, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. నాసిరకం ఫర్నీచర్‌ను వెనక్కు పంపి, నాణ్యమైన ఫర్నీచర్‌ను సరఫరా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా క్షేత్రస్థాయి నుంచి నాసిరకం ఫర్నీచర్‌పై ఫిర్యాదులు వచ్చినా కార్పొరేషన్ మాత్రం హడావుడిగా ఫర్నీచర్ సరఫరా చేసిన కంపెనీలకు రూ.15 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల మేరకు కార్పొరేషన్ సరఫరా చేసిన వాటిలో నాణ్యత లేక వాటిపై ఫిర్యాదులు వస్తే.. థర్డ్‌పార్టీ తనిఖీలకు ఆదేశిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి థర్డ్‌పార్టీ తనిఖీలకు ఆదేశాలివ్వకపోవడం, హడావుడిగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.