అభివృద్ధికి 99 రోజులు!
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:26 AM
ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం రూపొందించిన....
ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్న ప్రభుత్వం
రేపటి నుంచి జూన్ 9 వరకు కార్యక్రమం
నేడు కలెక్టర్లతో సీఎం కీలక భేటీ
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం రూపొందించిన ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేయనుంది. ఈ నెల 4 నుంచి జూన్ 9 వరకు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ శాఖ తన పరిధిలో క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన అన్ని పనులపైనా సవివర అంశాలను పొందుపరిచిన ఒక నోట్‌ను జిల్లాల కలెక్టర్‌లకు అందించనుంది. మంగళవారం సచివాలయంలో నిర్వహించే కలెక్టర్‌ల సమావేశంలో ఈ నోట్‌లను సీఎం రేవంత్‌రెడ్డి వారికి అందించనున్నారు. ఈ ‘99 రోజుల యాక్షన్ ప్లాన్’పై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. సచివాలయంలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత సమాచారంతో తప్పక హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జారీ చేసిన అంతర్గత ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ప్రతీ శాఖ వారీగా ఇచ్చిన పనుల మేరకు వాటిని పూర్తిచేసేలా లక్ష్యాలను విఽధించారు. 14 వారాలపాటు వారానికో అంశం, వాటిలోనూ ఏ రోజు ఏయే పనులు చేయాలనే విషయాన్ని కూడా కలెక్టర్‌లకు ఇచ్చే నోట్‌లో పొందుపరిచారు. కాగా, గ్రామీణ మహిళలు సమిష్ఠిగా ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రయోజనం కలిగేలా ప్రతి గ్రామానికీ మహిళా భవనాన్ని నిర్మించనున్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3వేల గ్రామీణ ‘మహిళా సమాఖ్య భవనాల’ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి భవన నిర్మాణానికి గరిష్ఠంగా రూ.10 లక్షల నిధులను ప్రభుత్వం వెచ్చించనుంది. మంచిర్యాలలో మొత్తం 67 మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ఆ జిల్లా కలెక్టర్ ఇప్పటికే అనుమతులు మంజూరు చేశారు.
మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ మహిళలు 42లక్షల మందికి హెల్త్‌మిషన్-100 పేరిట 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు, గిరిజనులు, అట్టడుగు వర్గాలే లక్ష్యంగా ఈ మిషన్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని 33 ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వృద్ధుల కోసం స్పెషల్ గెరియాట్రిక్ క్యాంపులు ఉంటాయి. గ్రామాల వారీగా వృద్ధులకు బీపీ, షుగర్ స్ర్కీనింగ్ చేస్తారు. మహిళలకు రక్తహీనత పరీక్షలు, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్ర్కీనింగ్, రుతుస్రావ శుభ్రతపై అవగాహన కల్పిస్తారు. డెలివరీ అయిన 14 రోజుల్లోపు ఏఎన్‌ఎంలు ఇంటికే వెళ్లి తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు. రెండో దశలో క్యాన్సర్‌ను ‘నోటిఫైడ్ డిసీజ్’గా గుర్తించే అవకాశం ఉంది. అలాగే కొత్త పాలసీలో భాగంగా క్యాన్సర్ కేర్‌పాలసీని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా క్యాన్సర్ రిజిస్ర్టీని ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య మహిళ కేంద్రాల్లో క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంపులు నిర్వహిస్తారు. దీనికితోడు ప్రాజెక్టుల నిర్మాణానికిగాను ఆయా ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియను సైతం.. ఈ 99 రోజుల కార్యక్రమంలో పూర్తిచేసేలా సంబంధిత శాఖకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.
గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం..
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ నెల 4 నుంచి జూన్ 9వరకు ‘స్వచ్ఛదనం-పచ్చదనం పేరిట 99 రోజుల పాటు గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం, 1505 అంగన్‌వాడీ భవనాల పనులు, 5వేల ఫామ్‌పాండ్స్ (పంట కుంటలు), 5వేల కంపోస్ట్ పిట్స్ నిర్మాణం, 565 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 అగ్రీ-న్యూట్రీ గార్డెన్ల ఏర్పాటు 12,760 పశువుల, 12,760 మేకల పాకల నిర్మాణం చేపట్టనున్నారు. రైతులు పండించిన పంటను భద్రపరచుకునేందుకు ఆహార నిల్వ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా 216 చోట్ల నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా 1000 పంచాయతీ భవనాల నిర్మాణం, 565 గ్రామీణ సంతల నిర్మాణం, 1000 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు.
స్వచ్ఛదనం.. పచ్చదనం ఇలా!
ఈ నెల 4 నుంచి 10 వరకు పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, గ్రామ సభలు, ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించడం, మురికి కాలువలు, రోడ్ల శుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రపరచడం వంటివి చేపట్టనున్నారు. 11 నుంచి 18 వరకు పిచ్చిమొక్కల తొలగింపు, పాత బావుల పూడ్చివేత, బ్లీచింగ్ పౌడర్ చల్లడంతోపాటు తాగునీటి పంపుసెట్లు, పైపులైన్ల మరమ్మతులు, క్లోరినేషన్ చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 216 ఆహార నిల్వ కేంద్రాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. 19 నుంచి 25 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో కొత్త ఇళ్లకు పన్ను విధింపు, వాణిజ్య భవనాల సర్వే, ట్రేడ్ లైసెన్సుల జారీ చేయనున్నారు. వీటితోపాటు వన మహోత్సవం నర్సరీల పనులు, రాష్ట్రవ్యాప్తంగా 1000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభం చేపట్టనున్నారు. ఇక ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు గ్రామ పంచాయతీల్లో వ్యాపార స్థలాల వేలం ప్రక్రియ పూర్తి చేయడం, పన్నుల వసూలు, 2026-27 సంవత్సరానికి పన్ను డిమాండ్ నిర్ణయించడం చేస్తారు. 1505 అంగన్‌వాడీ భవనాల నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు గ్రామాల్లో నిల్వ ఉన్న నీటి తొలగింపు, జ్వరాల వ్యాప్తి, వీధి కుక్కలపై ఇంటింటి సర్వే, వేసవికి తాగునీటి సరఫరా ఏర్పాట్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.