Share News

పురపాలక శాఖకు రూ.650 కోట్ల సాస్కి రుణం

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:43 AM

కేంద్ర ప్రభుత్వం సాస్కి పథకం కింద తెలంగాణ పురపాలక శాఖకు రూ.650 కోట్ల రుణం మంజూరు చేసింది. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద అందించే ఈ నిధులను మునిసిపాలిటీల్లో....

పురపాలక శాఖకు రూ.650 కోట్ల సాస్కి రుణం

  • మూలధన పెట్టుబడి కింద కేంద్రం మంజూరు

  • పట్ణణాల్లో వసతుల కల్పనకు వినియోగం

  • రాష్ట్ర పురపాలక శాఖ సంస్కరణలకు ఓకే

  • త్వరలో మరో రూ.250 కోట్లు విడుదల?

  • వడ్డీలేని రుణం చెల్లింపునకు 50 ఏళ్ల గడువు

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్ర జ్యోతి): కేంద్ర ప్రభుత్వం సాస్కి పథకం కింద తెలంగాణ పురపాలక శాఖకు రూ.650 కోట్ల రుణం మంజూరు చేసింది. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద అందించే ఈ నిధులను మునిసిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నారు. స్కీమ్‌ ఫర్‌ స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (సాస్కి) పథకం నుంచి గత పదేళ్లలో ఇంత పెద్దమొత్తంలో నిధులు రావడం ఇదే తొలిసారి. పురపాలక శాఖ చేపట్టిన సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లను డిజిటలైజ్‌ చేయడం, క్రమబద్ధీకరించడం, పట్టణ ప్రణాళికలో జియో ట్యాగింగ్‌ ద్వారా ఆస్తుల గుర్తింపు, మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, మునిసిపల్‌ బాండ్లు జారీ చేసి మునిసిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించడం వంటి సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదే పథకం కింద గత ఏడాది జూలైలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం), పురపాలక శాఖ సంచాలకులు(సీడీఎంఏ) సంయుక్తంగా హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించాయి. ఆ సమావేశంలో కేంద్రం నుంచి మూలధన పెట్టుబడి కింద ప్రోత్సాహకాలు పొందడానికి అవసరమైన కార్యాచరణపై చర్చించారు. మునిసిపాలిటీల సామర్థ్యం పెంపు, జీఐఎస్‌ ఆధారిత ఆస్తులు, మౌలిక వసతుల మ్యాపింగ్‌, సమీకృత ఆస్తి పన్ను నిర్వహణ పద్ధతులు, చట్టబద్దమైన పట్టణ ప్రణాళిక అమలు, సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ర్టిక్ట్‌ పునరుద్ధరణ, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సంస్కరణల అమలుపై చర్చించారు.


50 ఏళ్ల కాలపరిమితితో వడ్డీలేని రుణం..

సాస్కి పథకం కింద కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల కాల పరిమితితో రాష్ట్రాలకు వడ్డీలేని రుణంగా ఈ ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2500 కోట్ల ప్రతిపాదనలు పంపగా.. తొలి దశలో రూ.650 కోట్లు విడుదల చేసిందని అధికారులు తెలిపారు. త్వరలోనే మరికొన్ని సంస్కరణలకు ఇదే పథకం కింద మరో రూ.250 కోట్లు విడుదలయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రోడ్డు రవాణా శాఖలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన మైలురాళ్లను చేరుకోవడంతో రూ.176.5 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో వాహనాల స్ర్కాపింగ్‌ పాలసీకి రూ.75 కోట్లు, విద్యుత్తు వాహనాల పన్ను రాయితీ మినహాయింపునకు రూ.50 కోట్లు, ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల(ఏటీఎస్‌) ఏర్పాటుకు రూ.51.5 కోట్ల చొప్పున ఆర్థిక సాయాన్ని సాస్కి పథకం కింద అందించింది. తెలంగాణ ప్రభుత్వం సాస్కి నిధులను ప్రధానంగా రహదారుల అభివృద్ధి, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా పట్టణీకరణను ఓఆర్‌ఆర్‌ అవతలకు విస్తరించేందుకు వీలుగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి, హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చే క్రమంలో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు పొందేందుకు పురపాలక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Updated Date - Mar 03 , 2026 | 03:43 AM