Share News

సొంతకాళ్లపైనే తెలంగాణ!

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:09 AM

కేంద్ర పన్నులు, గ్రాంట్లపై అతితక్కువగా ఆధారపడుతూ, అత్యధికంగా సొంత ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ, హరియాణా ముందున్నాయని 16వ ఆర్థిక సంఘం ప్రశంసించింది.

సొంతకాళ్లపైనే తెలంగాణ!

  • కేంద్ర పన్నులు, గ్రాంట్లపై అతి తక్కువగా ఆధారపడుతున్న రాష్ట్రం

  • పన్ను వసూళ్ల ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి

  • రాష్ట్ర రుణభారమూ పెరుగుతోంది..16వ ఆర్థిక సంఘం వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పన్నులు, గ్రాంట్లపై అతితక్కువగా ఆధారపడుతూ, అత్యధికంగా సొంత ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ, హరియాణా ముందున్నాయని 16వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో జీఎ్‌సడీపీలో తెలంగాణ రెవెన్యూ వ్యయం 11.5ు, మూలధన వ్యయం 3.5ు.. మొత్తంగా 15ు ఉంటుందని తెలిపింది. ఒడిశా, గుజరాత్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు మూలధన ప్రాజెక్టులపై 20ు మేరకు ఖర్చు చేస్తున్నట్లు ఆర్థిక సంఘం వెల్లడించింది. తెలంగాణలో ఆర్థిక లోటు 3.4ు ఉన్నదని, మొత్తం అప్పులు జీఎ్‌సడీపీలో 27.3ు ఉంటాయని తెలిపింది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రశంసించింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎ్‌సడీపీలో అప్పులు 18.7 శాతమే ఉండగా, 2023-24 నాటికి 27.3 శాతానికి పెరిగాయని ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తంచేసింది. జీఎ్‌సడీపీలో అత్యధిక శాతం పన్నులున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌ ఉన్నాయని పేర్కొంది. ఉదయ్‌ పథకం కింద డిస్కంల రుణాల్లో జీఎ్‌సడీపీలో 0.5 శాతానికి మించి అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో విద్యుత్‌ సబ్సిడీ భారం ఏటా పెరుగుతూ పోతోందని ఆర్థిక సంఘం హెచ్చరించింది. 2018-19లో ఈ సబ్సిడీ రూ.4,978 కోట్లు కాగా, 2023-24 నాటికి రూ.16,016 కోట్లకు చేరుకుందని తెలిపింది. సామాజిక భద్రత పింఛన్ల కోసం ఏపీ, యూపీ తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఎక్కువగా ఖర్చు చేస్తోందని తెలిపింది. 2023-24లో పింఛన్లకు రూ.10,182 కోట్లు కేటాయించారని పేర్కొంది. రైతుభరోసా పేరుతో రాష్ట్రంలో అతిభారీ నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నారని, రెవెన్యూ వ్యయంలో పదిశాతం మేర నగదు బదిలీ చేస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీ్‌సగఢ్‌ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించింది. 2023-24లో సబ్సిడీలపై తెలంగాణ వ్యయం రూ.16,460 కోట్లు ఉందని తెలిపింది.

Updated Date - Feb 02 , 2026 | 03:09 AM