Share News

సమస్యల పరిష్కారానికే పోరాటం

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:53 AM

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళనలు ఆపేది లేదంటూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది...

సమస్యల పరిష్కారానికే పోరాటం

  • ఎస్పీడీసీఎల్‌ ఆవరణలో.. రాత్రి 10 గంటల వరకు విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య వేదిక మహాధర్నా

  • యాజమాన్యంతో చర్చలు విఫలం

  • డిస్కమ్‌ల పరిధిలో బదిలీ ప్రక్రియ వాయిదా

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళనలు ఆపేది లేదంటూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. విద్యుత్‌ సంస్థల యాజమాన్యం మొండి వైఖరికి వ్యతిరేకంగా బుధవారం ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయం ఆవరణలో విద్యుత్‌ ఉద్యోగుల ఐక్యవేదిక(టీఈఈఈజేఏసీ, టీజీపీఈజేఏసీ) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. తమ పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసన అని తెలిపారు. తెలంగాణ పవర్‌ ఇంజనీర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ సాయిబాబా, తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ జాన్సన్‌, కన్వీనర్లు రత్నాకర్‌, శివాజీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న బదిలీ ప్రక్రియ నిలిపివేసి, ప్రతిసారీ నిర్వహిస్తున్నట్లు జూన్‌, జూలై నెలల్లో బదిలీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం తప్పనిసరి బదిలీలు చేసినా కనీస సర్వీసు 2 సంవత్సరాల స్థానంలో 3 ఏళ్లకు సవరించాలన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే బదిలీ నిబంధనలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం నుంచి సరైన హామీ రాకపోవడంతో గురువారం నుంచి కార్పొరేట్‌ ఆఫీ్‌సతో పాటు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని విద్యుత్‌ ఉద్యోగుల ఐక్యవేదిక కార్యాచరణ ప్రకటించింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామన్నారు. కాగా మేనేజ్‌మెంట్‌తో బుధవారం రాత్రి తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల ఐక్యవేదిక నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో రాత్రి 11 గంటల వరకు కార్పొరేట్‌ ఆఫీసు ఆవరణలో ఉద్యోగులు ధర్నా కొనసాగించారు. రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో విద్యుత్‌ డిస్కమ్‌ల పరిధిలో జరిగే బదిలీ ప్రక్రియను యాజమాన్యం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యుత్‌ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్‌ సర్కార్‌ మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 05:53 AM