టీజీ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:19 AM
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. శుక్రవారం జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 4, 5 తేదీల్లో.. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మే 9 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని ఎప్‌సెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే ఎంటెక్, ఎం-ఫార్మసీ, ఎం-ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ ఈసెట్ పరీక్షలు మే 28 నుంచి 31 వరకు జరగనున్నాయి. వ్యాయామ విద్యలో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మార్చి 3న ప్రారంభమై మే 5న ముగియనుంది. మే 31 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పీఈసెట్ కన్వీనర్ ఆచార్య రాజేష్ కుమార్ తెలిపారు.